బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ).. భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌కు ఓ ఆఫర్ ఇచ్చింది. తమ జాతీయ జట్టుకు టెస్టు బ్యాటింగ్ సలహాదారుడుగా ఉండాలని కోరింది. అయితే దీనిపై ఇతడు స్పందించలేనట్లు సమాచారం. ఒకవేళ ఈ ఆఫర్‌కు అంగీకరిస్తే జూన్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న బంగ్లా జట్టుకు సేవలందించనున్నాడు. 110 రోజులు (జూన్ 2020 నుంచి ఫిబ్రవరి 2021) ఆ దేశ బోర్డుతో కలిసి పనిచేయనున్నాడు బంగర్. ప్రస్తుతం వన్డేలు, టీ20లకు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ నీల్ మెకంజే బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.
ప్రపంచకప్ ఫలితం తర్వాత వేటు..
వన్డే ప్రపంచకప్ తర్వాత భారత జ్టటు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ బంగర్ పదవీకాలం ముగియగానే.. ఇంటర్వ్యూలు నిర్వహించిన సెలక్షన్ కమిటీ బంగర్‌కు షాకిచ్చింది. రవిశాస్త్రిని రెండోసారి కోచ్‌గా ఎంపిక చేసిన కపిల్‌దేవ్ అధ్యక్షతన సీఏసీ.. ఇతడికి మాత్రం మొండిచేయి చూపించింది. ప్రపంచకప్‌లో భారత్ బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఇతడిని ఎంపిక చేయలేనట్లు చెప్పింది.
టీమిండియా బ్యాటింగ్ లైనప్ కూర్పులో బంగర్ తన పాత్రకు తగిన న్యాయం చేయలేదని బీసీసీఐ కూడా భావించింది. అయితే బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ మాత్రం మంచి ఫలితాలు సాధించినట్లు పేర్కొంది.
బంగర్ 2014-2019 కాలంలో టీమిండియాకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు. చివరిగా వరల్డ్‌కప్ తర్వాత విండీస్ పర్యటనకు వెళ్లాడు. ప్రపంచకప్ తర్వాత ఇతడి స్థానంలో విక్రమ్ రాఠోన్ను నియమించింది బీసీసీఐ. 47 ఏళ్ల బంగర్.. 2001 నుంచి 2004 మధ్య భారత జట్టు తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు.