మైదానంలో తోటి ఆటగాడిపై దాడికి పాల్పడిన బంగ్లాదేశ్ సీనియర్ బౌలర్ షహదత్ హొస్సేన్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఫలితంగా అతడు జాతీయ క్రికెట్ లీగ్‌లో ఆడలేడు. అంతేకాకుండా రూ. 2 లక్షల 53 వేలు (3 లక్షల టాకాలు) జరిమానా వేస్తూ నిర్ణయం తీసుకుంది బోర్డు.
బంగ్లాదేశ్ లీగ్‌లో భాగంగా ఢాకా, ఖుల్నా డివిజన్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా అరఫత్ సన్నీ.. షహదత్ బౌలింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నించాడు. సహనం కోల్పోయిన మాజీ పేసర్.. అతనిపై దాడి చేశాడు.
" షహదత్ తన నేరాన్ని అంగీకరించి ఇంటికి వెళ్లాడు. మ్యాచ్ రిఫరీ నివేదికను నిపుణుల కమిటీ పరిశీలించి జాతీయ క్రికెట్ లీగ్ నుంచి అతడిని నిషేధించింది. ఇప్పట్నుంచి అయిదేళ్లు సస్పెన్షన్ ఎదుర్కొంటాడు. అలాగే బంగ్లా క్రికెట్ బోర్డు పరిధిలో ఏ టోర్నీలోనూ పాల్గొనలేడు. 3 లక్షల టాకాల జరిమానా విధించాం".
--బంగ్లా క్రికెట్ బోర్డు అధికారి
షహదత్ 2005 నుంచి 2015 వరకు బంగ్లా తరఫున 38 టెస్టులు, 51 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. మొత్తం 153 వికెట్లు తీశాడు. 33 ఏళ్ల హొస్సేన్ పేలవ ఫామ్ కారణంగా 2015 నుంచి జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటి నుంచి దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు.