టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్.. ఒకానొక దశలో అత్యుత్తమ ఆటగాడిగా జట్టులో రాణించాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం పేలవమైన ప్రదర్శన వల్ల జట్టులో స్థానంలో కోల్పోయాడు. అయితే సోమవారం అతడి పుట్టినరోజు సందర్భంగా ఓ అభిమాని త్రో బ్యాక్ వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. భారత్ చేతిలో బంగ్లాదేశ్ జట్టు ఓటమి తట్టుకోలేక.. ఓ బంగ్లా అభిమాని చేసిన వీరంగం ఈ వీడియోలో చిత్రీకరించి ఉంది.
ఈ వీడియోలో.. 2018 శ్రీలంక వేదికగా నిదహాస్ ట్రోఫీలో భాగంగా భారత్, బంగ్లా మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆఖరి బంతికి విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. చివరి బంతికి దినేశ్ కార్తీక్ సిక్స్ కొట్టి ఇండియాకు విజయాన్ని అందించాడు. ఫలితంగా బంగ్లా ఓటమి చెందింది. ఆ ఓటమిని తట్టుకోలేక బంగ్లా వీరాభిమాని వీరంగం సృష్టించాడు. ఇల్లు పీకి పందిరి వేసినంత పని చేశాడు. ముందున్న వస్తువునల్లా విసిరి పారేశాడు. క్షణాల్లో ఇల్లంతా చిందరవందర చేశాడు.