బంగ్లదేశ్తో టీమిండియా సిరీస్కు మార్గం సుగమమైంది. డిమాండ్లు పరిష్కరించాలంటూ బంగ్లా క్రికెటర్లు చేసిన సమ్మెతో ఆ దేశ క్రికెట్ బోర్డు(బీసీబీ) దిగివచ్చింది. వారి సమస్యలు పరిష్కరిస్తామని బుధవారం హామీ ఇచ్చేసరికి ఆటగాళ్లు ఆందోళన విరమించారు. ఈ విషయాన్ని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ వెల్లడించారు.
"క్రికెటర్ల డిమాండ్లను మేము ఆమోదించాం. వారి సమస్యలను పరిష్కరిస్తాం. ఆటగాళ్లతో మాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు" - నజ్ముల్ హసన్, బీసీబీ అధ్యక్షుడు.
తమ డిమాండ్లకు బోర్డు సానుకూల స్పందించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు బంగ్లా సీనియర్ ఆటగాడు షకిబుల్ హసన్. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని బీసీబీ మాటిచ్చిందని తెలిపాడు.