బంగ్లాదేశ్ క్రికెటర్లు తమీమ్ ఇక్బాల్ 128*(109 బంతుల్లో; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), లిటన్ దాస్ 176 (143 బంతుల్లో ; 16 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడం వల్ల... ఆ జట్టు ఖాతాలో మరో ట్రోఫీ చేరింది. జింబాబ్వేతో శుక్రవారం జరిగిన చివరి వన్డేలో బంగ్లా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 123 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
సిరీస్ గెలిచిన ఆనందంలో బంగ్లా జట్టు రికార్డు భాగస్వామ్యం
సెంచరీల మోత మోగించిన బంగ్లా ఓపెనర్లు లిటన్ దాస్, తమీమ్.. తొలి వికెట్‌కు ఏకంగా 292 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వన్డేల్లో ఏ వికెట్‌కైనా బంగ్లాదేశ్‌కు ఇదే అత్యుత్తమం. అంతేకాకుండా శతకాలు బాదిన బంగ్లా తొలి ఓపెనింగ్ జోడీగానూ రికార్డులకెక్కారు. ఈ సిరీస్‌లో లిటన్, ఇక్బాల్‌లకు ఇది రెండో సెంచరీ.
వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్‌గానూ లిటన్ రికార్డు సృష్టించాడు. గత మ్యాచ్‌లో తమీమ్ ఇక్బాల్ (158) నెలకొల్పిన రికార్డును దాస్ బద్దలుగొట్టాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 43 ఓవర్లలో 3 వికెట్లు నష్టానికి 322 పరుగులు చేసింది. 33.2 ఓవర్ల వద్ద వర్షం రాగా ఆటను 43 ఓవర్లకు కుదించారు. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం జింబాబ్వే లక్ష్యాన్ని 43 ఓవర్లలో 342 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనలో జింబాబ్వే.. 37.3 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే బ్యాట్స్‌మన్ సికిందర్ రాజా 61(50 బంతుల్లో; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. బంగ్లా బౌలర్ సైఫుద్దీన్ 4 వికెట్లు తీశాడు.
కెప్టెన్సీకి గుడ్‌బై
బంగ్లాదేశ్ పేసర్ మష్రఫే మొర్తజా.. వన్డే కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. త్వరలో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. జింబాబ్వేతో జరిగిన చివరి వన్డేలో ఆఖరిసారి సారథిగా బాధ్యతలు చేపట్టాడు మొర్తజా. మొత్తంగా 87 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించి, 49 సార్లు విజయాన్ని అందుకున్నాడు. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఘనత సాధించాడు.