అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆడకుండా బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ షకిబుల్ హసన్‌పై రెండేళ్ల నిషేధం పడింది. అవినీతి నిరోధ విభాగం నమోదు చేసిన అభియోగాలను షకిబ్ అంగీకరించాడని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వెల్లడించింది. అతడిపై ఒక ఏడాది పూర్తిగా నిషేధం, మరో ఏడాది సస్పెన్షన్ ఉంటుందని చెప్పింది. ఈ వార్త తెలియగానే బంగ్లా క్రీడా విభాగం, అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ విషయంపై ఆ దేశ ఆటగాళ్లు ఈ స్టార్ ఆల్‌రౌండర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
నువ్వు లేకుండా ఆడేదెలా మిత్రమా...
వన్డే కెప్టెన్ మష్రఫె మొర్తజా, కీపర్ ముష్ఫికర్ రహీమ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.... షకిబ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
"ఒకే వయసు ఉన్న మనిద్దరం అంతర్జాతీయ క్రికెట్లో 18 ఏళ్లు కలిసి ఆడాం. నువ్వు(షకీబ్)లేకుండా మైదానంలో ఆడాలంటే చాలా బాధగా ఉంది. కచ్చితంగా పుంజుకుని తిరిగొస్తావు. నువ్వొక ఛాంపియన్వి. నేను, బంగ్లాదేశ్ ఎప్పటికీ నీకు మద్దతుగా ఉంటాం. ధైర్యంగా ఉండు.. అంతా మంచే జరుగుతుంది"
-- ముష్ఫికర్ రహీమ్, బంగ్లా క్రికెటర్
ఈ స్టార్ ప్లేయర్‌కు తన మద్దతు ప్రకటించాడు ప్రపంచకప్ బంగ్లా జట్టు సారథి మొర్తజా. 2023 ప్రపంచకప్ ఫైనల్ షకిబ్ సారథ్యంలో ఆడతామని అభిప్రాయపడ్డాడు. ఈ తాజా పరిణామాలు వల్ల కొన్ని రోజులు తనకు నిద్రపట్టదని అన్నాడు.మరో క్రికెటర్ రెహ్మన్.. షకిబ్‌పై వేటుపడటం ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పాడు.
"ఇలాంటి పరిస్థితిలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నువ్వు లేకుండా బరిలోకి దిగాలనేది ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. నీ గురించి నేను నమ్మేది ఒకటే. నువ్వు కచ్చితంగా రెట్టింపు ఆటతో మళ్లీ వస్తావు. ఆ రోజు కోసం మేమంతా వేచి చూస్తుంటాం. భాయ్ నీకెప్పుడూ మా మద్దతు ఉంటుంది"
--ముస్తాఫిజుర్ రెహ్మన్, బంగ్లా క్రికెటర్