చారిత్రక పింక్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ బోల్తా పడింది. టీమిండియా బౌలర్ల ధాటికి 106 పరుగులకే కుప్పకూలింది. కేవలం 30.2 ఓవర్లే ఆడిన బంగ్లాలో... ఇస్లామ్(29)దే అత్యధిక స్కోరు. ఇషాంత్ శర్మ 5 వికెట్లతో నిప్పులు చెరిగాడు. ఉమేశ్ యాదవ్ 3, మహ్మద్ షమీ 2 వికెట్లు తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేయస్ను(4) ఔట్ చేసి పింక్ బంతితో తొలి వికెట్ తీసిన భారత బౌలర్‌గా ఇషాంత్ రికార్డు సృష్టించాడు. అనంతరం ఉమేశ్ యదవ్ ఆకట్టుకున్నాడు. ఒకే ఓవర్లో మోమినుల్ హక్(0), మహ్మద్ మిథున్(0) పెవిలియన్ చేర్చి బంగ్లా పులులను కోలుకోలేని దెబ్బతీశాడు.
నలుగురు డకౌట్..
బంగ్లా కెప్టెన్ మొమినుల్ హక్(0), మహ్మద్ మిథున్(0), ముష్ఫికర్ రహీమ్(0), అబూ జాయేద్(0) నలుగురూ డకౌటవ్వడం విశేషం. లంచ్ విరామానికే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది బంగ్లాదేశ్. మొమినుల్, మహ్మద్ మిథున్‌ను ఉమేశ్ డకౌట్ చేయగా.. ముష్పీకర్, అబు జాయేద్‌ను షమీ పెవిలియన్ చేర్చాడు.