దాదాపు ఏడాది తర్వాత భారత్‌లో క్రికెట్ సందడి మొదలయ్యేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం(ఫిబ్రవరి 5) నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలక సిరీస్ జరగనుంది. చెన్నై వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరేందుకు ఇరు జట్లకు ఈ సిరీస్ ఎంతో కీలకం.
ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి, చారిత్రక విజయం సాధించిన టీమ్ఇండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లాండ్.. అదే ఉత్సాహంతో ఆడేందుకు సిద్ధమవుతోంది. దీనికి తోడు ఫ్యాబ్ ఫోర్‌గా పిలుచుకునే జాబితాలోని కోహ్లీ, రూట్ తమ తమ జట్లకు సారథ్యం వహిస్తుండడం వల్ల ఈ సిరీస్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచనుంది. చెన్నై పిచ్ మొదటి రోజు బౌన్స్‌కు సహకరిస్తే మూడో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. దీంతో ఇరుజట్లకు స్పిన్నర్ల ఎంపిక కీలకంగా మారనుంది.
టీమ్ఇండియా బలాలు, బలహీనతలు
పితృత్వ సెలవు పూర్తి చేసుకుని కెప్టెన్ కోహ్లీ తిరిగి జట్టులోకి రావడం టీమ్ఇండియా బలాన్ని పెంచింది. గిల్, పంత్ లాంటి యువకులతో పాటు పూజారా, రహానె, రోహిత్ లాంటి అనుభవజ్ఞులతో జట్టు సమతూకంగా ఉంది. ఆస్ట్రేలియాలోని బౌన్సీ ట్రాక్‌లపై బెరుకు లేకుండా బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ.. బ్యాట్స్‌మెన్‌కు సహకరించే చెన్నై పిచ్‌పై ఎన్ని అద్భుతాలు చేస్తారో చూడాలి.
బౌలింగ్ కూర్పు విషయంలో సెలక్టర్లకు తలనొప్పి ఎదురవుతోంది. మొదటి పేసర్‌గా బుమ్రా ఎంపిక ఖాయమవగా, రెండో పేసర్‌గా ఇషాంత్ శర్మకు మహ్మద్ సిరాజ్ గట్టి పోటీనిస్తున్నాడు. ఆసీస్ సిరీస్‌లో సీనియర్ల గైర్హాజరీతో సిరాజ్ బౌలింగ్ బాధ్యతలను మోసి ప్రశంసలు అందుకున్నాడు. స్పిన్నర్ల విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉండగా అనుభవం రీత్యా అశ్విన్‌కు చోటు పక్కా. సుందర్‌కు అక్షర్ పటేల్ నుంచి పోటీ ఎదురవుతోంది. గత సిరీసులో చోటివ్వని చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశమిచ్చే అంశంపై గందరగోళం నెలకొంది.
ఇంగ్లాండ్ బలాలు, బలహీనతలు