భారత జట్టు పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా సంధించిన యార్కర్లు, బౌన్సర్లు తనను ఆశ్చర్యంలో ముంచెత్తాయని ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. అతడి బౌలింగ్‌లో ఆడటం ఎంతో కష్టమని తెలిపాడు. వాంఖడే వేదికగా జరిగిన తొలి వన్డేలో 256 పరుగుల లక్ష్యాన్ని.. వార్నర్ (128*), ఫించ్ (110*) అజేయ శతకాలు సాధించి మ్యాచ్ను 37.4 ఓవర్లలోనే ముగించేశారు. బుమ్రా వికెట్లు పడగొట్టనప్పటికీ అతడి బౌలింగ్ అద్భుతమని వార్నర్ ప్రశంసించాడు.
"బ్రెట్‌లీ లాంటి బౌలర్ బౌండరీ సరిహద్దు నుంచి కొంత తడబడుతూ అకస్మాత్తుగా 150 కి.మీ వేగంతో బంతులు వేయడాన్ని నేను ఊహించలేను. అందుకు అలవాటు పడాలంటే కాస్త సమయం అవసరం. బుమ్రాది గొప్ప నైపుణ్యం. అతడి బౌన్సర్లు, యార్కర్లు ఆశ్చర్యపరుస్తాయి. అతడు బౌలింగ్‌లో మార్పు చేస్తే కష్టంగా అనిపిస్తుంది. లసిత్ మలింగ అత్యుత్తమ ఫామ్‌లో 140 కి.మీ వేగంతో స్వింగ్ బౌలింగ్ ఎలా ఉంటుందో... బుమ్రా సాధారణ బంతి ఎదుర్కోవడం అంత కష్టంగా అనిపిస్తుంది. క్రీజులో నిలదొక్కుకోవడం వల్లే నేను పరుగులు చేయగలిగాను"