తెలంగాణ

telangana

ETV Bharat / sports

బబుల్​గమ్​ తింటూ.. వేయి పరుగులు బాదేశాడు - లబుషేన్‌ 1000

సూపర్‌ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ లబుషేన్‌ న్యూజిలాండ్‌తో జరుగుతున్నటెస్టులో అరుదైన రికార్డు అందుకున్నాడు. ఇటీవలె సుదీర్ఘ ఫార్మాట్‌లో వరుసగా మూడు శతకాలు బాదిన ఈ క్రికెటర్​.. తాజాగా మరో ఘనత సాధించాడు. ఈ ఏడాది వేయి పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు.

Australian cricketer Marnus Labuschagne
బబుల్​గమ్​ తింటూ... వేయి పరుగులు చేసేశాడు..!

By

Published : Dec 14, 2019, 7:47 PM IST

లబుషేన్​.. ప్రస్తుతం టెస్టు క్రికెట్​లో మారుమోగుతున్న పేరు. స్టార్​ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, స్టీవ్​ స్మిత్​, కేన్​ విలియమ్సన్​ వంటి సీనియర్లు రాజ్యమేలుతున్న సమయంలో 25 ఏళ్ల ఓ యువ క్రికెటర్​ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో ఈ ఏడాది ఏకంగా వేయి పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.

ఏడాది క్రితమే అరంగేట్రం..

గతేడాది అక్టోబర్‌లో పాకిస్థాన్​తో జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు లబుషేన్​. అప్పట్లో పెద్దగా పేరుతెచ్చుకోని ఇతడు.. యాషెస్​ సిరీస్​లోని రెండో టెస్టులో స్టీవ్‌ స్మిత్‌ గాయపడటం వల్ల కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి ఆకట్టుకున్నాడు. తొలి కాంకషన్‌ క్రికెటర్​గా రికార్డునూ ఖాతాలో వేసుకున్నాడు.

అప్పటినుంచి తనదైన ఆటతీరుతో ఆ జట్టులోని స్మిత్​, వార్నర్​ వంటి క్రికెటర్లకు గట్టి పోటీనిస్తున్నాడు లబుషేన్. పదకొండు ఇన్నింగ్స్‌ల్లో ఈ క్రికెటర్​... 59, 74, 80, 67, 11, 48, 14, 185, 162, 143, 50 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా టెస్టు ర్యాంకింగ్స్‌లో 110వ స్థానం నుంచి ఎనిమిదో ర్యాంక్​కు చేరాడు. ఇన్ని మ్యాచ్​ల్లో కలిపి మొత్తం 2 సిక్సర్లే కొట్టడం విశేషం.

లబుషేన్​

బ్రాడ్​మన్​ తరహాలో హ్యాట్రిక్​...

పెర్త్​ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు (డే/నైట్‌)లో అరుదైన రికార్డు సాధించాడు లబుషేన్. సుదీర్ఘ ఫార్మాట్‌లో వరుసగా మూడు శతకాలు బాదిన మూడో ఆసీస్‌ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు చార్లెస్‌(1926), బ్రాడ్‌మన్ (1937) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇటీవల పాక్‌తో జరిగిన సిరీస్‌లో వరుసగా 185, 162 పరుగులు చేసిన లబుషేన్‌.. కివీస్‌పై శతకం బాది ఈ జాబితాలో చేరాడు.

వేయి పరుగుల వీరుడు...
ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా లబూషేన్‌ మరో రికార్డు సాధించాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో ఈ మార్కును అందుకున్నాడు. ఈ మ్యాచ్​లో 50 రన్స్​ చేసి కెరీర్​లో ఆరో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కివీస్‌తో రెండో ఇన్నింగ్స్‌కు ముందు లబుషేన్‌ 972 పరుగులతో ఇప్పటికే ఈ ఏడాదే తొలి స్థానంలో ఉండగా.. మరో 28 పరుగుల్ని పూర్తి చేసుకుని వేయి పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఏడాది అత్యధిక టెస్టు పరుగులు సాధించిన జాబితాలో లబూషేన్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కోహ్లీ, మయాంక్​, వార్నర్​ వంటి ఆటగాళ్లు ఇతడి వెనుకనే ఉన్నారు. ఆసీస్‌కే చెందిన స్టీవ్‌ స్టిత్‌(857) రెండో స్థానంలో ఉన్నాడు.

లబుషేన్​

ఒక ఏడాదిలో వేయి టెస్టు పరుగులు పూర్తి చేసుకున్న ఆసీస్‌ క్రికెటర్ల జాబితాలో... లబుషేన్‌ కూడా స్థానం సంపాదించాడు. 2014 నుంచి ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వార్నర్‌ రెండు సార్లు వేయి పరుగులు చేస్తే... స్మిత్‌ నాలుగు సార్లు, వోగ్స్​ ఒకసారి ఆ ఫీట్‌ సాధించాడు.

ఈ కుడిచేతి వాటం బ్యాట్స్​మన్ ఇటీవల​ తన ప్రదర్శనకు కారణం వెల్లడించాడు. మైదానంలో కూల్​గా ఉండటం వల్లే బ్యాటింగ్​ బాగా చేయగలుగుతున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా బబుల్​గమ్​ తిని ఒత్తిడిని తగ్గించుకుంటాడని చెప్పుకొచ్చాడు లబుషేన్​.

ABOUT THE AUTHOR

...view details