భారత్‌తో త్వరలో ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ఉదయం తమ జట్టును ప్రకటించింది. మొత్తం 17 మంది సభ్యులను ఎంపిక చేయగా అందులో ఐదుగురు కొత్త క్రికెటర్లకు అవకాశం కల్పించింది. కరోనా నేపథ్యంలో బయోబబుల్ పరిస్థితుల కారణంగా అదనంగా ఈ యువ ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ కొత్త క్రికెటర్లలో విల్ పుకోవిస్కి(Will Pucovski) అనే విక్టోరియా టీమ్ (ఆస్ట్రేలియా దేశవాళీ జట్టు) ఓపెనర్‌ను ఎంపిక చేయడమే అసలు విశేషం. అతడు షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ద్విశతకాలు బాది 495 పరుగులు చేశాడు. దీంతో సెలక్షన్ కమిటీ అతడిని డేవిడ్ వార్నర్‌కు జోడీగా పనికొస్తాడని రెండో ఓపెనర్‌గా ఎంపిక చేసింది. మరోవైపు వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టులోని కామరూన్ గ్రీన్‌ను కూడా ఎంపిక చేశారు. అతడు కూడా తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటాడు. టిమ్‌పైన్ సారథ్యంలో ఆస్ట్రేలియా డిసెంబర్ 17 నుంచి కోహ్లీసేనతో టెస్టు సిరీస్ ఆడనుంది. అంతకుముందు ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి.