తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్​ క్రికెట్లో మరో మిస్సైల్.. మెరిపిస్తున్న లబుషేన్​ - ఆసీస్​ క్రికెట్లో మరో మిసైల్.. మెరిపిస్తున్న లబుషేన్​

మార్నస్ లబుషేన్.. లెగ్​స్పిన్నర్​గా కెరీర్​ ఆరంభించి క్రమంగా బ్యాటింగ్​లో రాటుదేలాడు.  కంకషన్​గా అంతర్జాతీయ మ్యాచ్​ల్లో అరంగేట్రం చేసి.. ఈ ఏడాదే టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసి సర్వత్రా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆసీస్​కు దొరికిన మేటి బ్యాట్స్​మన్​గా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

Australia New Sensation cricketer Marnus Labuschagne
ఆసీస్​ క్రికెట్లో మరో మిసైల్.. మెరిపిస్తున్న లబుషేన్​

By

Published : Dec 17, 2019, 8:02 AM IST

టెస్టు క్రికెట్‌ చరిత్రలో మొట్టమొదటి కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అతడు. ఐదు రోజుల ఆటలో ఆడే అవకాశం దక్కింది ఒక్క రోజే. కానీ ఆగస్టులో యాషెస్‌ రెండో టెస్టులో క్లిష్ట సమయంలో దక్కిన ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటూ బలమైన ముద్ర వేశాడు. గాయంతో నిష్క్రమించిన స్మిత్‌ స్థానాన్ని సమర్థంగా భర్తీ చేస్తూ.. ఆర్చర్‌, ఇతర పేసర్ల భీకర పేస్‌ బౌలింగ్‌ను ధైర్యంగా ఎదుర్కొంటూ టాప్‌ స్కోరర్‌గా నిలవడమే కాదు, ఆ జట్టు డ్రాతో గట్టెక్కడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత అతడి జోరుకు అడ్డేలేకుండా పోయింది. శరవేగంగా ఐసీసీ ర్యాంకింగ్స్‌ టాప్‌-5లోకి దూసుకెళ్లిన ఆ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌. నాలుగు నెలల్లోనే అత్యంత ఆధారపడ్డ బ్యాట్స్‌మన్‌గా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అతడు ఉన్నత శిఖరాల దిశగా పరుగులు తీస్తున్నాడు.

లెగ్‌స్పిన్నర్‌ నుంచి..

12 టెస్టుల్లో 58.05 సగటుతో 1103 పరుగులు. ఇప్పటివరకు లబుషేన్‌ టెస్టు రికార్డిది. లార్డ్స్‌ ఇన్నింగ్స్‌ తర్వాత వరుసగా 74, 80, 67, 11, 48, 14, 185, 162, 143, 50తో అదిరే ప్రదర్శన చేశాడు. చాలా వేగంగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-లోకి దూసుకెళ్లాడు. చిత్రమేంటంటే.. పుస్తకాల్లో ఉన్నట్లుగా షాట్లు ఆడతాడని, ఒత్తిడిని స్పాంజ్‌లా పీల్చుకుంటూ క్లిష్టపరిస్థితుల్లో క్రీజులో పాతుకుపోతాడని పేరున్న లబుషేన్‌.. నిజానికి కెరీర్‌ మొదట్లో లెగ్‌స్పిన్నర్‌. క్రమంగా బ్యాటుతో రాటుదేలాడు. లెగ్‌స్పిన్‌ కూడా వచ్చిన కారణంగానే అతడు తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.

నిరుడు యూఏఈలో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేసిన అతడు డకౌట్‌తో కెరీర్‌ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత సిడ్నీలో భారత్‌తో డ్రాగా ముగిసిన టెస్టులో పోరాటంతో 38 పరుగులు చేసి తొలిసారి అందరి దృష్టిలో పడ్డాడు. యాషెస్‌ ముందు కౌంటీల్లో ఆడాలని నిర్ణయించుకోవడం లబుషేన్‌ కెరీర్‌నే మలుపు తిప్పింది. గ్లామోర్గాన్‌కు ప్రాతినిధ్యం వహించిన అతడు 10 మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలతో 1114 (61.89 సగటు) పరుగులు సాధించాడు. ఆ ఫామే యాషెస్‌లో అతడికి ఉపయోగపడింది. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సాగిన అతడు తాజాగా వరుసగా మూడు (పాకిస్థాన్‌పై రెండు, న్యూజిలాండ్‌పై ఒకటి) శతకాలు బాదాడు. ఇప్పుడు అతడు కంగారూల జట్టులో ప్రధాన బ్యాట్స్‌మన్‌. అంతే కాదు.. పరుగుల యంత్రం స్టీవ్‌ స్మిత్‌ (873)ను వెనక్కి నెడుతూ 1022 పరుగులతో ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక స్కోరర్‌గా ఘనత సాధించాడు.

ఈ ఏడాదే వెయ్యి పరుగులు..

2019లో వెయ్యి పరుగులు దాటిన తొలి బ్యాట్స్‌మన్‌గా అతడు నిలిచాడు. అలవోకగా భారీ ఇన్నింగ్స్‌ ఆడే సామర్థ్యంతో లబుషేన్‌.. తాము ఎప్పుడూ కేవలం స్మిత్‌పైనే ఆధారపడాల్సిన అవసరం లేదన్న భరోసా ఆస్ట్రేలియాకు కల్పించాడు. అతడి బ్యాటింగ్‌ కంటే కూడా ఎంత ఒత్తిడిలోనైనా దృఢ సంకల్పంతో నిలిచే తత్వమే లబుషేన్‌ను ప్రత్యేకమైన ఆటగాడిగా నిలుపుతోంది. అతడికి కోచింగ్‌ ఇవ్వడం చాలా తేలికని, విషయాలను బాగా ఆకలింపు చేసుకుంటాడని అంటాడు ఆస్ట్రేలియా కోచ్‌ లాంగర్‌.

అప్పుడే సంపాదన..

లబుషేన్‌ సంపన్న కుటుంబానికి చెందినవాడేమీ కాదు. వీలైనంత వరకు తల్లిదండ్రుల మీద భారాన్ని తగ్గించాలన్నది అతడి ఉద్దేశం. అందుకే ఓ వైపు క్రికెట్‌ ఆడుతూనే, చదువుతూనే ఖర్చుల కోసం పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేశాడు. తన 16వ ఏట గబ్బా స్టేడియంలో హాట్‌స్పాట్‌ కెమెరాలను ఆపరేట్‌ చేసినందుకు 90 డాలర్లు అందుకున్నాడు. బ్యాటును బంతిని తాకిందా లేదా అన్నది చూపించడం, టీవీ రీప్లేల ద్వారా క్యాచ్‌, ఎల్బీ అప్పీళ్లపై నిర్ణయం తీసుకోవడంలో అంపైర్లకు సహకరించడం అతడి పని. ఎంతో ఇష్టంగా పనిచేశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టులో తన సహచరుడు పీటర్‌ సిడిల్‌ 2010 యాషెస్‌లో హ్యాట్రిక్‌ పడగొట్టినప్పుడు కెమెరాను ఆపరేట్‌ చేసింది లబుషేనే.

మార్నస్ లబుషేన్

కొత్త దేశం.. భాష రాదు

లబుషేన్‌ సొంత దేశం దక్షిణాఫ్రికా. అక్కడే జన్మించిన అతడు పదేళ్ల వయసులో కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు. అప్పటికి లబుషేన్‌కు ఆఫ్రికన్స్‌ భాష మాట్లాడడం మాత్రమే వచ్చు. ఇంగ్లిష్‌ అస్సలు రాదు. దీంతో బడిలో లబుషేన్‌ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కానీ క్రికెట్లో మెరిశాడు. స్కూల్లో అందరికీ ఇష్టుడయ్యాడు. అక్కడి పరిస్థితుల్లో ఇమిడిపోయేందుకు తన పేరు ఉచ్ఛారణను 'ల-బు-స్కాగ్‌-నీ'’ నుంచి 'ల-బు-షేన్‌'గా మార్చుకున్నాడు.

టాప్‌-5లో లబుషేన్‌

ఈ ఏడాది ఆగస్టులో యాషెస్‌ సిరీస్‌ సందర్భంగా స్టీవ్‌ స్మిత్‌ స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా అరంగేట్రం చేసిన నాటి నుంచి పరుగుల వరద పారిస్తున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ లబుషేన్‌.. అప్పుడే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అయిదో స్థానానికి చేరుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అతను మూడు స్థానాలు మెరుగుపరుచుకుని అయిదో ర్యాంకులో నిలిచాడు. ఇటీవల పాకిస్థాన్‌తో సిరీస్‌లో 162, 185 పరుగులు చేసిన ఈ కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్‌.. తాజాగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 143, రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగులు సాధించాడు.

"లబుషేన్‌ రూపంలో ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఓ అద్భుతమైన క్రికెటర్‌ దొరికాడు. యాషెస్‌ మధ్యలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన అతడు కఠిన పరిస్థితుల్లో గొప్పగా ఆడాడు. లబుషేన్‌ టెక్నిక్‌ చాలా బాగుంది. ఫాస్ట్‌బౌలింగ్‌ను బాగా ఆడుతున్నాడు. స్పిన్‌ బౌలింగ్‌నూ సమర్థంగా ఎదుర్కొంటున్నాడు"
- రికీ పాంటింగ్‌, ఆసీస్ మాజీ కెప్టెన్

ఇప్పటిదాకా 12 టెస్టులాడిన లబుషేన్‌ 58.05 సగటుతో 1103 పరుగులు చేశాడు. అందులో మూడు శతకాలు, ఆరు అర్ధశతకాలు ఉన్నాయి.

లబుషేన్‌ తొలి టెస్టు ఆడినపుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అతడి స్థానం 110. ప్రస్తుతం టెస్టుల్లో అతను అయిదో ర్యాంకుకు చేరుకున్నాడు.

ఇదీ చదవండి: సాక్షిని ఆటపట్టించిన ధోనీ.. జ్ఞాపకాలు పదిలమంటూ పోస్ట్

ABOUT THE AUTHOR

...view details