ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌కు పాకిస్థాన్ బెంబేలెత్తిపోయింది. ఫలితంగా కాన్బెర్రా వేదికగా జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది ఆసీస్ జట్టు. స్మిత్ (80*; 51 బంతుల్లో 11ఫోర్లు, 1సిక్సర్) పరుగులు చేసి ఆసీస్ జట్టుకు అద్భుత విజాయాన్ని అందించాడు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'నూ అందుకున్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. పాక్ సారథి బాబర్ అజామ్ (50), ఇఫ్తికర్ అహ్మద్ (62*) అర్ధశతకాలతో రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆస్టన్ రెండు వికెట్లు పడగొట్టగా కమిన్స్, రిచర్డ్స్‌సన్ చెరో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టుకు... ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వార్నర్ (20)ను ఆమిర్ ఔట్ చేశాడు. కొద్దిసేపటికే ఫించ్ (17) కూడా ఔటవ్వడం వల్ల పవర్‌ప్లేలో ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన బెన్(21)తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలుత నిదానంగా ఆడిన స్మిత్ అర్ధశతకం తర్వాత విజృంభించాడు. పాక్ బౌలర్లపై చెలరేగుతూ మరో 9 బంతులు ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.
పాక్ బౌలర్లలో ఇర్ఫాన్, వసీమ్, ఆమిర్‌లో తలో వికెట్ దక్కించుకున్నారు. రెండో మ్యాచ్‌లో గెలిచి 1-0తో ఆసీస్ ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలలేదు. పెర్త్ వేదికగా శుక్రవారం నిర్ణయాత్మక ఆఖరి టీ20 జరగనుంది.