తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​లో మరపురాని మెరుపు... అతనొక్కడు ఒకవైపు - ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్ ​ఇయాన్​ బోథమ్ అసాధారణ ఇన్నింగ్స్​

ఆ జట్టు ఫాలోఆన్‌ ఆడుతోంది. స్కోరు 135 మాత్రమే. మిగిలిన వికెట్లు మూడే. ఏడో నంబర్‌ ఆటగాడికి తోడుగా.. లోయర్డారర్లో ఇంకో ముగ్గురున్నారు. ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవాలన్నా ఇంకో 92 పరుగులు చేయాలి. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ గట్టిగా పోరాడితే మహా అయితే ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవచ్చేమో! కానీ ఇలాంటి స్థితి నుంచి ఆ జట్టు పుంజుకుని విజయం సాధించిందంటే నమ్మగలరా? నాలుగు దశాబ్దాల కిందట ఓ అసాధారణ ఇన్నింగ్స్‌తో ఈ అద్భుతాన్నే ఆవిష్కరించాడు ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ ఇయాన్‌ బోథమ్‌. ఆ అద్భుతం ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం పదండి.

Australia former allrounder Iyan bodham plays extraordinary innings in England Australia series
మరపురాని మెరుపు... అతనొక్కడు ఒకవైపు

By

Published : Apr 27, 2020, 7:01 AM IST

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య క్రికెట్‌ పోరాటాలు యుద్ధాల్లా సాగే రోజులవి.. రెండు జట్ల మధ్య జరిగే టెస్టు సమరం యాషెస్‌లో విజయం కోసం ఆటగాళ్లు ప్రాణం పెట్టి పోరాడే కాలమది. 1981లో ఆరు టెస్టుల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌కు వచ్చింది ఆస్ట్రేలియా. తొలి టెస్టులో విజయంతో సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. రెండో మ్యాచ్‌ డ్రా అయింది. మూడో టెస్టులో కంగారూ జట్టుకు అదిరే ఆరంభం లభించింది. తొలి ఇన్నింగ్స్‌ను 401/9 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. బోథమ్‌ (6/95) సత్తా చాటినా మిగతా బౌలర్లు తేలిపోవడం వల్ల ఆస్ట్రేలియా విజయానికి బలమైన పునాది పడ్డట్లే కనిపించింది. తర్వాత డెన్నిస్‌ లిల్లీ (4/49), అల్డర్‌మ్యాన్‌ (3/59), లాసన్‌ (3/32)ల ధాటికి ఇంగ్లిష్‌ జట్టు 174 పరుగులకే కుప్పకూలింది. బౌలింగ్‌లోనే కాక బ్యాటింగ్‌లోనూ బోథమ్‌ (50) సత్తా చాటాడు. అయినా ప్రత్యర్థికి 227 పరుగుల భారీ ఆధిక్యం లభించడం వల్ల ఇంగ్లాండ్‌ ఫాలోఆన్‌ ఆడాల్సిన పరిస్థితి తలెత్తింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆ జట్టుకు కష్టాలే. స్కోరు బోర్డుపై ఒక్క పరుగైనా చేరకుండానే వికెట్‌ పడింది. అల్డర్‌మ్యాన్‌ (6/135), లిల్లీ (3/94) ధాటికి ఇంగ్లాండ్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 135/7కు చేరుకుంది. ఇక ఆ జట్టు ఓటమి లాంఛనమే అని అందరూ నిర్ణయానికి వచ్చేశారు. ఆసీస్‌ స్కోరుకు ఇంకా 92 పరుగులు వెనుకబడే ఉండటం వల్ల ఇన్నింగ్స్‌ ఓటమి తప్పుతుందన్న ఆశలు కూడా ఇంగ్లిష్‌ అభిమానుల్లో లేవు. స్టేడియంలో నైరాశ్యం అలుముకుని ఉంది.

ఇలాంటి సమయంలో బోథమ్‌ నమ్మశక్యం కాని రీతిలో ఆడాడు. పరిస్థితులు అత్యంత ప్రతికూలంగా ఉన్నా.. ప్రత్యర్థి జట్టు పేసర్లు లిల్లీ, అల్డర్‌మన్‌ పరీక్ష పెడుతున్నా.. అతను తనదైన శైలిలో బ్యాటింగ్‌ చేశాడు. పోరాడితే పోయేదేముంది అన్నట్లుగా ఎదురుదాడికి దిగాడు. గ్రాహమ్‌ డిలీ (56) నుంచి సహకారం అందడం వల్ల స్వేచ్ఛగా షాట్లు ఆడటం మొదలుపెట్టాడు. కాసేపట్లోనే స్టేడియంలో వాతావరణం మారిపోయింది. మ్యాచ్‌ ఫలితం ఏమవుతుందో తర్వాత అనుకుని.. బోథమ్‌ మెరుపు బ్యాటింగ్‌ను ఆస్వాదించడం మొదలుపెట్టారు అభిమానులు. ఒక్కసారిగా టెస్టును వన్డే మ్యాచ్‌లా మార్చేసి ఆసీస్‌ బౌలర్లను ఉతికారేశాడతను. బ్యాక్‌ఫుట్‌పై పాయింట్‌, కవర్స్‌ దిశగా బోథమ్‌ కొట్టిన కొన్ని షాట్లు.. లిల్లీ బౌలింగ్‌లో ఆడిన హుక్‌ షాట్లు వీక్షకుల్ని ఉర్రూతలూగించాయి. గ్రాహమ్‌ తోడుగా చూస్తుండగానే ఎనిమిదో వికెట్‌కు 117 పరుగులు జోడించాడు బోథమ్‌. దీంతో ఇన్నింగ్స్‌ ఓటమి ప్రమాదం తప్పింది. తర్వాత ఓల్డ్‌ (29) సాయంతో అతను స్కోరును మరింత పెంచాడు. బోథమ్‌ 148 బంతుల్లోనే 149 పరుగులు చేసి అజేయంగా నిలవడం వల్ల ఇంగ్లాండ్‌ అనూహ్యంగా 356 పరుగులు చేసి ఆలౌటైంది. అతను ఏకంగా 27 ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదడం విశేషం. అంటే బౌండరీల ద్వారా వచ్చిన పరుగులే 114. అయితే ఆసీస్‌ ముంగిట 130 పరుగుల లక్ష్యమే నిలవడం వల్ల ఇంగ్లాండ్‌కు విజయావకాశాలు లేనట్లే కనిపించింది. కానీ బోథమ్‌ కష్టం వృథా కానివ్వకుండా.. బాబ్‌ విల్లీస్‌ (8/43) సంచలన బౌలింగ్‌తో ఆసీస్‌ పతనాన్ని శాసించాడు. ఆ జట్టు 111 పరుగులకే ఆలౌటవడంతో ఇంగ్లాండ్‌ 18 పరుగుల విజయాన్నందుకుంది. టెస్టు చరిత్రలో ఎవరు, ఎప్పుడు ఉత్తమ ఇన్నింగ్స్‌ల జాబితా తయారు చేసినా.. తన శతకాన్ని అందులో చేర్చక తప్పని పరిస్థితి కల్పించాడు బోథమ్‌.

ఇదీ చూడండి : 'గెలిచినప్పుడు ధోనీ ఎక్కడున్నా.. ఓడినప్పుడు ముందుంటాడు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details