ఆస్ట్రేలియాతో మూడో టెస్టు కోసం టీమ్ఇండియా నెట్ ప్రాక్టీసును ముమ్మరం చేసింది. సిడ్నీ టెస్టుకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడం వల్ల మంగళవారం నుంచి ఆటగాళ్లు పూర్తిస్థాయి ప్రాక్టీసును మొదలుపెట్టారు. రోహిత్ శర్మ జట్టులోకి తిరిగి రావడం వల్ల టీమ్ఇండియా ఉత్సాహం రెట్టింపు అయ్యింది.
శిబిరంలో ఆటగాళ్లు ప్రాక్టీసు చేస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో బీసీసీఐ పంచుకుంది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, బౌలర్ మహ్మద్ సిరాజ్ నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తున్నట్లు అందులో ఉంది.
సిరీస్ నుంచి వైదొలిగిన రాహుల్
సూపర్ ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యాడు. ఎడమచేతి మణికట్టు బెణకడం వల్ల ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ ప్రకటించింది.
ఇప్పటికే కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ జట్టుకు దూరమవ్వగా.. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ కూడా దూరమవ్వడం టీమ్ఇండియాను కలవరపెడుతోంది. అయితే ప్రాక్టీస్‌లో రాహుల్‌కు శనివారమే గాయమైందని, కోలుకోవడానికి మరో మూడు వారాలు పడుతుందని బీసీసీఐ తెలిపింది. అతడు స్వదేశానికి బయలుదేరి, ఎన్‌సీఏలో చేరనున్నాడని వెల్లడించింది.
ఇదీ చూడండి:'టెస్టు జెర్సీ ధరించడం గర్వంగా ఉంది'