అగ్రజట్టు ఆస్ట్రేలియాతో దాని సొంతగడ్డపై సుధీర్ఘ సిరీస్ ఆడేటప్పుడు తొలి మ్యాచ్‌లో విజయం ఎంతో అవసరం. కానీ అలాంటి కీలక మ్యాచ్‌లో భారత్ పూర్తిగా విఫలమైంది. ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు పకడ్బంధీగా బౌలింగ్ చేయలేదు. బ్యాటింగ్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు నిరాశపరిచారు. అత్యుత్తమ జట్టుతో సిరీస్ ఆడుతున్నప్పుడు తొలి మ్యాచ్‌లో చూపించాల్సిన తీవ్రత టీమ్ఇండియా ఆటగాళ్లలో కనిపించలేదు. తొలి అర్ధంలో బౌలింగ్, ఫీల్డింగ్ పూర్తిగా తేలిపోయింది. ఒక్క ఇన్నింగ్స్ అయినా అవకముందే ఈ మ్యాచ్‌లో ఫలితం తేలిపోయింది! ఏ దశలోనూ అసలు విజయం సాధించే జట్టులా భారత్ ఆడలేదు. టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు.
టీమ్ఇండియాలో కనిపించని జోష్.. రెండో వన్డేలోనైనా?
ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో టీమ్ఇండియా విఫలమైంది. ఈ విషయాన్ని కోహ్లీ కూడా ఒప్పుకున్నాడు. మరి రెండో వన్డేలోనైనా భారత జట్టు ప్రదర్శన మారుతుందా? లేదా? అని అభిమానులు అనుకుంటున్నారు.
'వన్డేల్లో 50 ఓవర్ల పాటు తీవ్రత కొనసాగించాల్సి ఉంటుంది కానీ చాలాకాలం తర్వాత వన్డే ఆడటం వల్ల వెనుకబడ్డామేమో అనిపిస్తోంది. అయితే మేం చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాం కాబట్టి ఎలా స్పందించాలో తెలుసు. కానీ ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో ఆటగాళ్ల శరీర కదలికలు మరీ పేలవంగా ఉన్నాయి. 25 ఓవర్ల తర్వాత చురుగ్గా కనిపించలేదు. అది చాలా నిరాశ కలిగించింది. అత్యంత నాణ్యమైన జట్టుతో పోటీపడ్డప్పుడు అవకాశాలు వదులుకుంటే ఫలితం ఇలానే ఉంటుంది. హార్దిక్ బౌలింగ్ వేసేందుకు ఇంకా సిద్ధం కాకపోవడం జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసింది' అని కోహ్లీ చెప్పాడు. ఈ మ్యాచ్ ప్రభావం నుంచి బయటపడి రెండో వన్డేలోనైనా కసితో ఆడుతుందేమో చూడాలి.
సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది భారత్. 66 పరుగుల తేడాతో గెలిచి ఆస్ట్రేలియా.. 1-0తో సిరీస్‌లో ఆధిక్యం సంపాదించింది.