1990 ఆగస్టు 14... ఇంగ్లాండ్ గడ్డపై తొలి టెస్టు శతకం నమోదు చేశాడు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్. అప్పటికి సచిన్ వయసు 17 ఏళ్లు. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 183 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. సారథి మహ్మద్ అజారుద్దీన్, దిలీప్ వెంగ్‌సర్కార్, కపిల్‌దేవ్ వంటి కీలక ఆటగాళ్లు పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో మనోజ్ ప్రభాకర్‌తో కలిసి 160 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు లిటిల్ మాస్టర్ సచిన్. 119 రన్స్‌తో అజేయంగా నిలిచాడు.
కనీసం నిల్చోలేదు..
తాను సెంచరీ చేసినప్పుడు బాల్కనీలో కూర్చొన్న జట్టు సభ్యులెవరూ కనీసం స్పందించలేదని తెలిపాడు సచిన్. "రవిశాస్త్రి బాల్కనీలోనే ఉండటం నాకు గుర్తుంది. అనిల్ కుంబ్లే, కిరణ్ మోరె, ఇతర ఆటగాళ్లు అక్కడే ఉన్నారు. కానీ అంగుళం కూడా కదల్లేదు. నాకప్పుడు ఇవేవీ తెలియవు. క్రికెట్ జట్టుగా ఆడే ఆట అయినప్పటికీ వారు అలా ఎందుకు చేశారో అర్థం కాలేదు. సహ ఆటగాళ్ల మద్దతు లేకపోతే పరుగులు చేయడం కష్టం. ఒత్తిడి విషయానికి వస్తే ప్రతి అంశంలోనూ ఉంటుంది. దానిని సానుకూలంగా అధిగమించాను" అని చెప్పుకొచ్చాడు సచిన్.
మద్దతివ్వాల్సిన వాళ్లే భయపెట్టారు..
ఈ మ్యాచ్ అనంతరం తొలిసారి మీడియా సమావేశానికి వెళ్తున్నప్పుడు సహచరులు బాగా భయపెట్టారని చెప్పుకొచ్చాడు సచిన్. ఆ సమయంలో జట్టు మేనేజర్ తనకు అండగా నిలిచారని వెల్లడించాడు. తాజాగా ఓ మీడియా కార్యక్రమంలో తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు మాస్టర్.
"తొలి టెస్టు చేసిన తర్వాత ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఏం జరిగిందో నాకు గుర్తుంది. డ్రెస్సింగ్‌రూమ్‌లో అందరూ నన్ను భయపెట్టారు. ఎందుకంటే నేనెప్పుడు మ్యాచ్‌ల తర్వాత మీడియాతో మాట్లాడలేదు. "ఈ రోజు నువ్వు కష్టాల్లో పడబోతున్నావు. వాళ్లు అన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు తెలుసా"? అన్నారు. ఆ సమయంలో జట్టు మేనేజర్ మాధవ్ మంత్రి నావద్దకొచ్చి భయపడొద్దని చెప్పారు. సమావేశంలో నా పక్కనే కూర్చుంటానని, మ్యాచ్ గురించి సమాధానాలు చెప్పమన్నారు".
-సచిన్ తెందూల్కర్, దిగ్గజ క్రికెటర్
1989లోనే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు సచిన్. ఇందులో 15 పరుగులే చేసి వకార్ యూనిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 100 శతకాలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 200 టెస్టుల్లో 51 సెంచరీలు, 463 వన్డేల్లో 49 శతకాలు చేశాడు సచిన్. 2013 నవంబర్ 16న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
ఇవీ చూడండి.. విజయంతో ఏడాదిని ముగించిన కోహ్లీసేన