ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్ టోర్నీని వచ్చే ఏడాది జూన్ వరకు వాయిదా వేస్తున్నట్లు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధికారిక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.
"కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆసియా కప్‌ను వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా వేయాలని కార్యనిర్వహక బోర్డు నిర్ణయించింది" అని ఏసీసీ ట్వీట్ చేసింది. ప్రణాళిక ప్రకారం ఈ టోర్నీ పాకిస్థాన్‌లో నిర్వహించాల్సింది. కానీ, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా ఆసియా కప్ నిర్వహణకు మరో వేదికను ఎంచుకోవాలని ఏసీసీ నిర్ణయించింది. దీంతో ఆసియా కప్-2021ని శ్రీలంకలో, 2022లో జరగాల్సిన ఆసియా కప్‌ను పాకిస్థాన్‌లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది ఆసియా క్రికెట్ మండలి. ఈ ప్రకటనతో సెప్టెంబరులో ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐకి మార్గం సుగమమైంది.