మూడు వికెట్ల నష్టానికి 39 పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతూ పరుగులు సాధించింది. 63 పరుగుల వద్ద 18 రన్స్ చేసిన బవుమాను ఇషాంత్ పెవిలియన్ పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డుప్లెసిస్‌తో కలిసి ఓపెనర్ డీన్ ఎల్గర్ భారత బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొన్నాడు. ఐదో వికెట్‌కు వీరిద్దరూ 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
భారీ స్కోర్ దిశగా సాగుతున్న దశలో అశ్విన్ వీరిద్దరి భాగస్వామ్యానికి తెరదించాడు. 55 పరుగులు చేసిన సారథి డుప్లెసిస్‌ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం డికాక్, ఎల్గర్ మరోసారి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 166 పరుగులు జోడించారు. ఈ దశలో ఎల్గర్ (160)ను జడేజా బోల్తా కొట్టించగా.. డికాక్ (111) అశ్విన్ చేతికి చిక్కాడు. ఫిలాండర్ (0) తొందరగానే ఔటవగా.. మూడో రోజు ఆటముగిసే సమయానికి సఫారీ జట్టు 8 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. మరో 117 పరుగుల వెనుకంజలో ఉంది.