ఆస్ట్రేలియాను ఓడించి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకున్న టీమ్‌ఇండియాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్లకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. క్రికెట్ హీరోలను అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అడిలైడ్‌లో 36కే ఆలౌటైన టీమ్‌ఇండియా తిరిగి పుంజుకొని 2-1తో సిరీసు గెలవడం అద్భుతమే. అయితే దాని వెనకాల ఓ రహస్యమే ఉంది. కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె, సహాయ సిబ్బంది రెండో టెస్టుకు ముందు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అదేంటో రవిచంద్రన్ అశ్విన్ చేసిన ముఖాముఖిలో ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ వివరించారు.
కోహ్లీ సందేశంతో మారిన యుద్ధవ్యూహం
టీమ్‌ఇండియా 36 పరుగులకే ఆలౌటైన రోజు అర్ధరాత్రి కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ సమావేశమయ్యారు. అదే సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 'ఏం చేస్తున్నారు' అని శ్రీధర్‌కు సందేశం పంపించాడు. 'అందరం కలిసి సమావేశం అయ్యాం' అని శ్రీధర్ చెప్పారు. 'నేనూ కలవొచ్చా' అని బదులిచ్చాడు కోహ్లీ. అదే రాత్రి 'మిషన్ మెల్‌బోర్న్' మొదలైంది. 'ఈ 36 పరుగుల్ని ఒక బ్యాడ్జిలా ధరించాలి! ఇదే 36 మనల్ని అత్యుత్తమ జట్టుగా మారుస్తుంది' అని రవిశాస్త్రి ఘంటాపథంగా చెప్పాడు.
మరునాడు ఉదయం అజింక్య రహానెతో కలిసి కోహ్లీ కోచింగ్ సిబ్బందితో మాట్లాడాడు. మెల్‌బోర్న్‌లో విజయానికి ఏం చేయాలో చర్చించాడు. అది విజయవంతంగా సాగింది. అడిలైడ్‌లో ఇంకా సమయం ఉన్నప్పటికీ కుర్రాళ్లతో సాధన చేయించలేదు. ఘోర ఓటమి తర్వాత కఠిన సాధన చేయడం ఆటగాళ్లలో ప్రతికూల ఆలోచనలు నింపుతుందని సహాయ సిబ్బంది భావించారు. చిన్న చిన్న సరదా ఆటలు ఆడించారు. జట్టులో స్వల్ప మార్పులు చేశాడు రవిశాస్త్రి.
'జట్టులో ఎక్కువమంది ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండాలని శాస్త్రి కోరుకున్నాడు. కుడిచేతివాటం బ్యాట్స్‌మెన్ ఉంటే ఆసీస్ బౌలర్లు ఒకేచోట బంతులు విసురుతారని భావించాడు. ఎడమతిచేవాటం బ్యాట్స్‌మెన్ ఉంటే ప్రత్యర్థి బౌలింగ్ లైన్‌లో మార్పు ఉంటుందని, వ్యూహత్మకంగా పనిచేస్తుందని అనుకున్నాడు. తొలి టెస్టులో బ్యాటింగ్‌లో విఫలమైతే బ్యాటర్లను మార్చకుండా అత్యుత్తమ ఐదుగురు బౌలర్లను రంగంలోకి దించాడు' అని శ్రీధర్ వెల్లడించారు.
మెల్‌బోర్న్‌లో టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలని టీమ్‌ఇండియా భావించింది. అజింక్య రహానె టాస్ ఓడిపోవడం వల్ల టిమ్‌పైన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత ఐదు మ్యాచుల్లో అక్కడ తొలుత బ్యాటింగ్ చేసినవాళ్లదే విజయం. దీంతో రవిశాస్త్రి భిన్నంగా ఆలోచించాడు. గతంలో ఎప్పుడైనా తొలుత బౌలింగ్ చేసిన జట్టు గెలిచిందేమో కనుక్కోమన్నాడు. టాస్ ఓడిపోయిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి 'యాష్.. యాష్' అంటూ కేకలు పెట్టాడు. 'తొలి పది ఓవర్లలోపే నువ్వు బంతిని తీసుకోవాలి' అని ఆదేశించాడు. తొలి రోజు అదీ పది ఓవర్లలోపు బంతి అందుకోవడమేంటని అశ్విన్ ఆశ్చర్యపోయాడు. ముందు అనుకున్నట్టుగా అజింక్య.. యాష్‌కు బంతినిచ్చాడు. వేసిన తొలి బంతే చక్కని బౌన్స్‌తో టర్న్ అవ్వడం వల్ల యాష్ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తనకు నోరూరిందని యాష్ చెప్పడం గమనార్హం. బంతి టర్న్ అవుతుండటం వల్ల రిషబ్ పంత్ ఎలా కీపింగ్ చేస్తాడోనని ఫీల్డర్లు భయపడటం గమనార్హం.
ఇదీ చూడండి:మరపురాని గెలుపు- భారత క్రికెట్లో మరో మలుపు