ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు జట్లన్నీ యూఏఈ చేరుకున్నాయి. కరోనా వైరస్ ముప్పుతో క్రికెటర్లు రకరకాల ఆంక్షలు పాటించాల్సి వస్తోంది. ఎవరితోనూ చనువుగా ఉండేందుకు వీల్లేదు. మనసు విప్పి మాట్లాడుకునేందుకు కుదరదు. కలిసి భోజనం చేస్తున్నా దూరం దూరంగానే ఉండాలి. మైదానంలో పని ముగియగానే ఎవరి గదిలోకి వారు వెళ్లిపోవాలి. ఇక బయో బుడగ దాటకుండా ఉండేందుకు జియో ట్యాగింగ్ ఉంగరాలు ధరించాలి. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో తామెలా ఉంటున్నామనే విషయాన్ని దిల్లీ క్యాపిటల్స్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వివరించాడు.
"గది గడప దాటేముందు కచ్చితంగా జియో ట్యాగింగ్ పరికరం ధరించాల్సిందే. ఇది మా కదలికలను గుర్తిస్తుంది. ఆటగాళ్లు మరీ దగ్గరకు వచ్చినప్పుడు గంట మోగుతుంది. గుంపులు గుంపులుగా ఉండకుండా చూస్తుంది.ఆటగాళ్లు సమీపిస్తే ట్రాకింగ్ పరికరం అధికారులను అప్రమత్తం చేస్తుంది. దూరం జరగాలని అప్పుడు అధికారులు మమ్మల్ని ఆదేశిస్తారు. ఆ పరికరంలో గంట కూడా మోగుతుంది. దీన్నంతా మాకు జూమ్ కాల్‌లో వివరించారు. అప్పుడొకరు ఓ సందేహం అడిగారు. తన సతీమణి ఈ పరికరం ధరించాలా అని ప్రశ్నించారు. భార్య, పిల్లలే కాకుండా బయో బుడగలో ఉన్న ఎవరైనా సరే దీనిని ధరించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు."