18 ఏళ్ల విరామం తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై యాషెస్ సిరీస్ గెలుచుకోవాలన్న ఆస్ట్రేలియా ఆశలు ఆవిరైపోయాయి. లండన్ ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో ఇంగ్లీష్ జట్టు 135 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించింది. 399 పరుగులు లక్ష్య ఛేదనలో బరిలో దిగిన కంగారూ జట్టు 263 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్ బ్యాట్స్‌మన్ మ్యాథ్యూ వేడ్(117) శతకం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్ చెరో 4 వికెట్లతో ఆకట్టుకున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో ఆకట్టుకున్న జోఫ్రా ఆర్చర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇంగ్లాండ్ తరఫున బెన్ స్టోక్స్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కైవసం చేసుకున్నాడు. ఆసీస్ జట్టు నుంచి స్టీవ్ స్మిత్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో స్మిత్ ఏడు ఇన్నింగ్స్‌లు ఆడిన స్మిత్ 774 పరుగులు చేశాడు.
ఓవర్ నైట్ స్కోరు 313 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 16 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్ కోల్పోయింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆదుకున్న స్టీవ్ స్మిత్ తొలి సారి విఫలమవగా.. మిగతా బ్యాట్స్‌మన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మ్యాథ్యూ వేడ్ శతకంతో కాసేపు పోరాడినప్పటికీ మరో ఎండ్ నుంచి వేడ్‌కు సహకారం లభించలేదు.