యాషెస్ సిరీస్ తొలి టెస్టులో కంగారూ జట్టును అద్భుత శతకంతో ఆదుకున్నాడు స్మిత్. 12 నెలల నిషేధం తర్వాత మళ్లీ టెస్టుల్లో బరిలోకి దిగిన ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్షిష్ట పరిస్థితుల్లో జట్టుకు అండగా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లు ప్రతాపం చూపిస్తోన్న సమయంలో ఒంటరి పోరాటంతో ఆసీస్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.
ఆదుకున్న దిగ్గజం...
ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య గురువారం ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తొలి టెస్టు మొదలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు... తొలి రోజు ఆట ముగిసేసరికి 80.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. బ్రాడ్, వోక్స్ ధాటికి ఓ దశలో 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను... సెంచరీతో ఆదుకున్నాడు స్మిత్. ఈ మ్యాచ్‌లో 144 పరుగులు(219 బంతుల్లో; 16 ఫోర్లు, 2 సిక్సర్లు)సాధించి.... కెరీర్‌లో 24వ శతకం నమోదు చేసుకున్నాడు స్టీవ్ స్మిత్. అతడికి లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పీటర్ సిడిల్ 44 పరుగులు (85 బంతుల్లో; 4 ఫోర్లు) సహాకారం అందించాడు.
ఒక్కరూ నిలబడలేదు...
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ట్యాంపరింగ్ నిషేధం అనంతరం తొలిసారి టెస్టు ఆడుతున్న ఓపెనర్లు వార్నర్ (2), బాన్‌క్రాఫ్ట్ (8) నిరాశపర్చారు. వీరిద్దరినీ బ్రాడ్ పెవిలియన్ చేర్చాడు. ఖావాజా (13)ను వోక్స్ పెవిలియన్ చేర్చాడు. 35 పరుగులకే టాపార్డర్ కుప్పకూలిన దశలో నాలుగో వికెట్‌కు హెడ్ 35 పరుగులు (61 బంతుల్లో ; 5 ఫోర్లు) సహాకారంతో 64 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు స్మిత్. తర్వాత హెడ్, వేడ్ (1)లను వెంటవెంటనే ఔట్ చేసి మళ్లీ ఆసీస్‌ను దెబ్బకొట్టాడు వోక్స్. ఈ సమయంలో కెప్టెన్ టిమ్ పైన్ (5), ప్యాటిన్సన్ (0), కమిన్స్ (5) పరుగులకే పెవిలియన్ చేరారు. అప్పటికి స్కోరు 122/8. కీలక సమయంలో నిలదొక్కుకున్న స్మిత్.. సిడిల్ తోడయ్యాక కాస్త జోరు పెంచాడు. 9వ వికెట్‌కు 140 బంతుల్లో 88 పరుగులు జోడించడం వల్ల వీరిద్దరూ ఆసీస్ స్కోర్ బోర్డ్‌ను 200 పరుగుల మార్క్ దాటించారు.
ఇంగ్లాండ్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్ (5/86), క్రిస్ వోక్స్ (3/58) పదునైన బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది.
మళ్లీ పరాభవం...
స్టీవ్ స్మిత్... 16 నెలల క్రితం టెస్టుల్లో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా పనిచేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ ఘటనకు బాధ్యుడిగా కెప్టెన్సీ కోల్పోయి, ఏడాది పాటు క్రికెట్‌కూ దూరమయ్యాడు. యాషెస్‌తో మళ్లీ టెస్టుల్లో పునరాగమనం చేసిన ఈ బ్యాట్స్‌మెన్... తనదైన రీతిలో మరోసారి బ్యాట్ ఝుళిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌కు దిగే సందర్భంలో మైదానంలో ప్రేక్షకుల నుంచి హేళన ఎదుర్కొన్నాడు స్మిత్. కాని వాటన్నింటికి సెంచరీతో సమాధానమిచ్చాడు.
ట్యాంపరింగ్‌కు ఉపయోగించే పేపర్లను పైకెత్తిన ఇంగ్లాండ్ అభిమానులు