తెలంగాణ

telangana

ETV Bharat / sports

47వ పడిలోకి ద్రవిడ్.. మరపురాని ఇన్నింగ్స్​పై ఓ లుక్కేయండి

క్రికెటర్, కీపర్, కెప్టెన్​.. ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి టీమిండియాకు మరపురాని విజయాలు అందించాడు రాహుల్ ద్రవిడ్. నేటితో 47 ఏళ్లు పూర్తిచేసుకుని 48వ పడిలోకి అడుగుపెడుతున్న మిస్టర్ డిఫెండబుల్ ద్రవిడ్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు.

Dravid
ద్రవిడ్

By

Published : Jan 11, 2020, 11:56 AM IST

రాహుల్ ద్రవిడ్.. ప్రత్యర్థుల విజయానికి అడ్డుగోడ.. టీమిండియాను ఎన్నోసార్లు ఆదుకున్న ఆపద్భాందవుడు. నిప్పులు చెరిగే బంతులేస్తున్నా.. అలవోకగా ఎదుర్కొంటూ.. బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టే నేర్పరి. సహచరులంతా పెవిలియన్ బాట పడుతున్నా.. క్రీజులో పాతుకుపోయే ద గ్రేట్ వాల్. క్రికెటర్​, కీపర్​, కెప్టెన్​.. తాజాగా ఎన్​సీయే అధ్యక్షుడు ఇలా కీలక బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా బీసీసీఐ ఓ వీడియోను షేర్ చేసి అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది.

ద వాల్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ జన్మదినోత్సవాన్ని చాలా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. టెస్టుల్లో అతడు మేటి బ్యాట్స్​మన్ అని అందరికి తెలుసు. న్యూజిలాండ్​తో వన్డేలో అతడి 153 పరుగులు స్కోరు ఇప్పుడు చూద్దాం -బీసీసీఐ ట్వీట్

1999లో హైదరాబాద్​లో కివీస్​తో జరిగిన ఈ మ్యాచ్​లో రాహుల్.. 153 పరుగులతో అదరగొట్టాడు. ఇందులో 15 ఫోర్లు రెండు సిక్సర్లు ఉన్నాయి. సచిన్​ తెందూల్కర్​తో కలిసి 331 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత్.. 2 వికెట్లు నష్టపోయి 376 పరుగులు చేసింది. ఫలితంగా న్యూజిలాండ్​పై 174 పరుగులు భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్​లో సచిన్ 186 పరుగులతో ఆకట్టుకుని నాటౌట్​గా నిలిచాడు.

ద్రవిడ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

  • వన్డేల్లో రెండు సార్లు 300కు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన ఏకైక బ్యాట్స్​మన్ ద్రవిడ్. సచిన్ - ద్రవిడ్(331), గంగూలీ-ద్రవిడ్(318).
  • 1999 ప్రపంచకప్​లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మన్​గా ద్రవిడ్ రికార్డు సృష్టించాడు. ఆ మెగాటోర్నీలో 8 మ్యాచ్​ల్లో 65.85 సగటుతో 461 పరుగులు చేశాడు.
  • టెస్టుల్లో వరుసగా నాలుగు శతకాలు బాదిన ఏకైక భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2002లో విండీస్​తో మ్యాచ్​లో 100 పరుగులు చేయగా.. అనంతరం ఇంగ్లాండ్ పర్యటనలో 114, 148, 127 పరుగులతో వరుసగా నాలుగు సెంచరీలు చేశాడు.
  • 2011 ఇంగ్లాండ్ పర్యటనలో ద్రవిడ్ పోరాటం గురించి చెప్పుకొని తీరాల్సిందే. ఈ సిరీస్​లో మొత్తం 461 పరుగులతో ఒంటరిగా పోరాడాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓవల్ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో మూడో స్థానంలో బ్యాటింగ్​కు దిగిన ద్రవిడ్.. జట్టంతా ఔటైనా.. తాను మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. మళ్లీ ఫాలోఆన్​లోనూ సత్తాచాటాడు. ఈ మ్యాచ్​లో 146 పరుగులు చేశాడు ద్రవిడ్. 4-0 తేడాతో సిరీస్​ను ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేసింది.
  • 164 టెస్టులు, 344 వన్డేలు, ఓ టీ20లో భారత తరఫున ప్రాతినిధ్యం వహించాడు ద్రవిడ్. 2012 మార్చిలో అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కొలు పలికాడు. కెరీర్​లో మొత్తం 48 శతకాలు చేశాడు.

ఇవీ చూడండి.. రాహుల్​తో ఆరోగ్యకరమైన పోటీ: ధావన్

ABOUT THE AUTHOR

...view details