భారత్‌లో భద్రతాపరమైన అంశాలపై విషం కక్కిన పీసీబీ ఛైర్మన్ ఎహ్‌సన్ మణిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ భద్రత విషయంలో కామెంట్ చేయడానికి కూడా అతడు పనికిరాడన్నారు.
"ఎవరైతే లండన్‌లో ఉంటారో, వారు భారత్‌లో భద్రత విషయాలపై కామెంట్ చేయడం సరికాదని తెలిపారు. ఎహ్‌సన్ పాకిస్థాన్ కన్నా లండన్‌లోనే ఎక్కువగా ఉంటాడని, అలాంటప్పుడు ఆ దేశ భద్రత గురించి కూడా కామెంట్ చేయడానికి అర్హత లేదు." -అరుణ్ ధుమాల్, బీసీసీఐ కోశాధికారి.
రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక పాకిస్థాన్‌లో పర్యటించిన నేపథ్యంలో సోమవారం ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ముగిసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 263 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా కరాచీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎహ్‌సన్ మాట్లాడాడు.