ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. వెస్టిండీస్‌తో మూడో టెస్టుకు అందుబాటులోకి వస్తాడని శనివారం ప్రకటించింది ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ). ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కరోనా 'బయో బబుల్' నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా రెండో టెస్టులో అతడిపై వేటు వేసింది యాజమాన్యం.
మందలింపు.. జరిమానా..
సౌథాంప్టన్‌లోని తొలి టెస్టు ముగిశాక.. జులై 13న ఆర్చర్ ఎవరికీ చెప్పకుండా బ్రిగ్టన్లోని తన ఇంటికి వెళ్లి వచ్చాడు. ఆ సమయంలో బయటివ్యక్తులను కలిసినట్లు విచారణలో తేలింది. ఫలితంగా అతడిని మందిలించడమే కాకుండా జరిమానా వేసింది బోర్డు. అంతేకాకుండా ఐదురోజుల పాటు హోటల్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచింది.
క్వారంటైన్ అనంతరం రెండు సార్లు కొవిడ్-19 టెస్టు చేయించుకున్న ఆర్చర్‌కు.. నెగిటివ్ ఫలితాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా జట్టుతో కలిసి ఆడేందుకు అనుమతినిచ్చారు. మంగళవారం ప్రాక్టీస్‌లో పాల్గొననున్నాడు. శుక్రవారం(జులై 24) నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది.
ఆర్చర్ తీరుపై మిశ్రమ స్పందనలు వెలువడ్డాయి. ఆర్చర్‌ను మూడో టెస్టు నుంచి తొలగించాలని చెప్పాడు మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్. ఆర్చర్ చేసిన పనికి మిలియన్ పౌండ్స్ నష్టం వచ్చినా.. యువ ఆటగాడు కాబట్టి తప్పు తెలుసుకుంటాడని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గిల్స్.
ఇంగ్లాండ్ ఆటగాడు బెన్‌స్టోక్స్ ఆర్చర్‌కు మద్దతుగా నిలిచాడు. ఇలాంటి సమయంలోనే జోఫ్రాకు తోడుగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. అయితే నిబంధనలు ఉల్లంఘించినందుకు బోర్డుకు క్షమాపణలు చెప్పాడు ఆర్చర్.