కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాడు. వైరస్ గురించి అభిమానులకు అవగాహన కల్పిస్తున్నాడు. ఇటీవలే పీఎం కేర్స్‌కు విరాళం అందజేయనున్నట్లు ప్రకటించాడు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌తో గురువారం రాత్రి లైవ్‌లో ముచ్చటించిన సందర్భంగా ఇద్దరి మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కోహ్లీ మాట్లాడుతూ తాను మాంసాహారానికి ఎందుకు దూరమయ్యాననే విషయాన్ని వెల్లడించడం సహా అనేక విషయాలను పీటర్సన్‌తో పంచుకున్నాడు. వీరిమధ్య సంభాషణ చాలాసేపు కొనసాగేసరికి కోహ్లీ సతీమణి అనుష్కశర్మ జోక్యం చేసుకొని సరదాగా అడ్డుచెప్పింది.
లైవ్ చాట్‌లో కోహ్లీని అడ్డుకున్న అనుష్క శర్మ - kohi latest news
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్‌తో కెప్టెన్ కోహ్లీ లైవ్ చాట్ చేస్తుండగా, సతీమణి అనుష్క శర్మ అతడికి అడ్డుతగిలింది. డిన్నర్ టైమ్ అయిందంటూ కామెంట్ పెట్టింది.
చలో చలో డిన్నర్ టైమ్ అంటూ నవ్వుతున్న ఎమోజీని జతచేసి లైవ్‌చాట్‌లో కామెంట్ పెట్టింది. దానిని స్క్రీన్‌షాట్ తీసిన పీటర్సన్.. అభిమానులతో పంచుకున్నాడు. అనంతరం అనుష్క నిద్రపోయేముందు కోహ్లీతో సరదాగా ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్స్‌తో తీసుకున్న ఫొటోలను స్టోరీస్‌లో పోస్టు చేసింది.
కోహ్లీ.. పీటర్సన్‌తో మాట్లాడేటప్పుడు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(ఆర్సీబీ) ఒక్కసారైనా విజేతగా నిలవకపోవడంపై స్పందించాడు. తమ జట్టు మూడుసార్లు ఫైనల్ చేరినా కప్పు గెలవలేకపోయిందని, ఆర్సీబీ కచ్చితంగా కప్పు సాధించడానికి అర్హమైన జట్టని అన్నాడు. విజయం గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అది అంత దూరం పారిపోతుందని చెప్పాడు. దానివల్ల అనవసర ఒత్తిడి తప్ప ఉపయోగం లేదని, ఆటను ఆస్వాదించాలని తెలిపాడు.