యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్లో తొలిసారిగా నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఆటగాళ్లకు డోపింగ్ పరీక్షలు చేయనుంది. ఇప్పటివరకు జరిగిన సీజన్లలో స్వీడన్‌కు చెందిన ఇంటర్నేషనల్ డోప్ టెస్ట్ అండ్ మెనేజ్మెంట్ (ఐడీటీఎమ్) సంస్థ పరీక్షలు జరిపింది. ప్రస్తుతం సీజన్‌కు ఇదే సంస్థ సహకారంతో లేదంటే నాడా సేవలను ఉపయోగించకోనున్నట్లు తెలుస్తోంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. 2019 మూడో త్రైమాసికం నుంచి నాడా పరిధిలోకి వచ్చింది. ఇందులో భాగంగానే సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు జరగనున్న ఐపీఎల్లో ఈ ఏజెన్సీనే ఆటగాళ్ల నమూనాలు సేకరించనుంది.
ఖర్చులు వాళ్లే భరించాలి
"ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చే వారం ప్రకటిస్తాం. ఆ ప్రణాళికను నాడాకు పంపిన తర్వాత స్వయంగా వారే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే నమూనాల సేకరణకు అయ్యే రవాణా ఖర్చులను వారే భరించాల్సి ఉంటుంది" అని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. 2019 ఐపీఎల్ సీజన్ వరకు ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆమోదించిన ఐడీటీఎమ్ ఇన్ఛార్జ్ నమూనా సేకరణలకు అయ్యే ఖర్చును బీసీసీఐ భరించేది.
దోహాకు నమూనాలు
నాడా నమూనాలను సేకరించి దోహాలోని ప్రయోగశాల వాడాకు రవాణా చేయడం అత్యంత ఖర్చుతో కూడుకున్నది. నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (ఎన్‌డీటీఎల్)ను వాడా సస్పెండ్ చేసినప్పటి నుంచి నాడా సేకరించిన నమూనాలను ఈ ల్యాబ్‌కు పంపుతుంది.