1970, అక్టోబర్ 17న బెంగళూరులో జన్మించాడు అనిల్ కుంబ్లే. ఈ టీమిండియా మాజీ కెప్టెన్ నేడు 49వ పడిలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా పలువురు క్రికెట్ ప్రముఖులు కుంబ్లేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కుడిచేతి వాటం లెగ్ స్పిన్నర్ అయిన క్రికెట్ దిగ్గజం... 1990లో ఆగస్టు 9న ఇంగ్లాండ్‌పై తొలి టెస్టు ఆడాడు. అదే ఏడాది శ్రీలంకపై వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో పాకిస్థాన్‌పై సాధించిన ఇన్నింగ్స్రికార్డు ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో చెక్కు చెదరకుండా ఉంది.
" భారత దిగ్గజ క్రికెటర్లలో నువ్వు కూడా ఒకడివి. భారత్‌కు అనేక చిరస్మరణీయమైన విజయాలు అందించి మా అందరికీ ఒక మార్గదర్శిగా నిలిచావు. కానీ నీ కెరీర్‌లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని దూరం చేసినందుకు క్షమించు. నిజ జీవితంలో నువ్వు సెంచరీ కొట్టాలని ప్రార్థిస్తున్నా. హాఫ్ సెంచరీని శతకంగా మలుచుకో... అనిల్ భాయ్. హ్యాపీ బర్త్ డే."
-- వీరేంద్ర సెహ్వాగ్
" నువ్వు భారత్‌కు అతి పెద్ద మ్యాచ్ విన్నర్. నువ్వు ఒక గ్రేటెస్ట్ స్పిన్నర్. నా బౌలింగ్ పార్ట్నర్, నా గురువు కుంబ్లేకు ఇవే నా శుభాకాంక్షలు."
-- హర్భజన్ సింగ్
దాయాదిపైనే ఇన్నింగ్స్...
ఫిబ్రవరి 7, 1999.. దిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్-పాక్ మధ్య టెస్టు మ్యాచ్. ఈ ఆటలో ఓ రికార్డు ఇన్నింగ్స్ నెలకొల్పాడు అనిల్ కుంబ్లే. ఈ ఘనత సాధించి 20 ఏళ్లయినా ఎవ్వరూ దాన్ని అందుకోలేకపోయారు.
తనదైన స్పిన్‌తో పాక్ జట్టులోని అందరినీ ఒక్కడే పెవిలియన్ చేర్చాడు కుంబ్లే. ఈ మ్యాచ్‌లో 26.3 ఓవర్లలో 74 పరుగులిచ్చి పది వికెట్లు పడగొట్టేశాడు. అప్పటి వరకు ఈ ఘనత ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ ఖాతాలోనే ఉండేది. ఆయన 1956లో ఈ పది వికెట్ల రికార్డు సాధించాడు. ఆ తర్వాత 43 ఏళ్లకు భారత దిగ్గజ బౌలర్ కుంబ్లే మళ్లీ ఆ ఫీట్ సాధించాడు. ఆ ఘనత అందుకున్న రెండో బౌలర్‌గా క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగుల చేసి ఆలౌటైంది. తర్వాత పాక్ 172 పరుగులకే కుప్పకూలింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్... ఎస్.రమేశ్(96), గంగూలీ(60*), శ్రీనాథ్(49) బ్యాటింగ్ ధాటికి 339 పరుగుల భారీ స్కోరు సాధించింది. 420 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పాకిస్థాన్.. కుంబ్లే బౌలింగ్ దెబ్బకు 207 పరుగులకు ఆలౌట్ అయింది.
ట్రాక్ రికార్డు...
కుంబ్లే 132 టెస్టులు ఆడి 29.6 సగటుతో 619 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 271 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించిన కుంబ్లే... 30.9 సగటుతో 337 వికెట్లు తీశాడు. జంబో తన చివరి వన్డే మ్యాచ్ 2007లో బెర్ముడాతో ఆడగా, చివరి టెస్టు మ్యాచ్ ఆస్ట్రేలియాతో 2008 అక్టోబర్‌లో ఆడాడు. భారత్ తరఫున టెస్టుల్లో, వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కుంబ్లేనే కావడం విశేషం.
క్రికెట్లో కుంబ్లే సేవలకుగానూ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కూడా చోటు దక్కింది. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా, వ్యాఖ్యాతగా, ఐసీసీలో పలు కీలక పదవులు చేపట్టాడు. ఐపీఎల్లో ఇటీవలే పంజాబ్ కోచ్‌గా ఎంపికయ్యాడు.