ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో 600 వికెట్లు సాధించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని పాకిస్థాన్ ప్రధాన కోచ్ మిస్బావుల్ హక్ అన్నాడు. సౌతాంప్టన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో అండర్సన్ ఈ ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 600 వికెట్లు కైవసం చేసుకున్న తొలి పేసర్ అండర్సన్ కావడం విశేషం. ఈ క్రమంలోనే మిస్బా తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
"అండర్సన్ 600 టెస్టు వికెట్లు సాధించడం నిజంగా అద్భుతం. అతను అసాధారణమైన క్రమశిక్షణ, ప్రేరణ, దృఢ నిశ్చయాన్ని కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఓ పేసర్ ఇన్ని వికెట్లు పడగొట్టడం చాలా కష్టం. అతని వ్యూహాలతో.. బ్యాట్స్‌మెన్‌కు ఎప్పుడూ సవాలు విసురుతుంటాడు. మేము కూడా యువ బౌలర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని అనిపిస్తోంది."