ఖాళీ స్టేడియాల్లో టీ20 ప్రపంచకప్ నిర్వహించాలన్న ఆలోచనపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్ పెదవి విరిచాడు. అలా ఊహించుకోవడం కష్టంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. అయితే అక్కడ కరోనా వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల సెప్టెంబరు 30 వరకు ఆ దేశానికి విమాన ప్రయాణాల్ని నిషేధించారు. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయలేని నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ప్రపంచకప్ నిర్వహించే యోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
దీనిపై బోర్డర్ స్పందిస్తూ.. "ఖాళీ స్టేడియాల్లో ప్రపంచకప్‌ను అసలు ఊహించుకోలేకపోతున్నా. అది నమ్మశక్యంగా అనిపించడం లేదు. జట్లు, సహాయ సిబ్బంది, ఆటకు సంబంధించిన మిగతా అధికారులు దేశమంతా తిరుగుతూ మ్యాచ్‌లు ఆడుతూ.. స్టేడియాల్లోకి జనాల్ని మాత్రం అనుమతించకపోవడమా? అలా ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటే టోర్నీని మామూలుగా నిర్వహించండి. లేదంటే టోర్నీని రద్దు చేసి మరో చోట నిర్వహించండి. అంతే తప్ప ప్రేక్షకులు లేకుండా టోర్నీని నిర్వహించొద్దు" అని చెప్పాడు.