భారత్×ఇంగ్లాండ్ మధ్య జరగనున్న డే/నైట్ టెస్టుకు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన మొతేరా వేదిక కానుంది. ఫిబ్రవరి 24 నుంచి ఇరు జట్ల మధ్య ప్రారంభం కానున్న మూడో టెస్టుతోనే ఆ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్‌కు స్వాగతం పలుకుతోంది. అహ్మదాబాద్‌లో ఉన్న మొతేరా స్టేడియం సామర్థ్యం లక్షా పదివేలు. అయితే ఇప్పటికే ఈ మైదానానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు స్టేడియం అందాలు, సదుపాయాల్ని చూసి ఫిదా అయ్యారు. మొతేరాలో అభిమానుల మధ్య ఆడాలని ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అన్నాడు.
"ఈ వాతావరణంలో అభిమానుల మధ్య ఆడటానికి ఎంతో ఉత్సుకతతో ఉన్నాం. ఆటగాళ్లందరూ మైదానాన్ని ఎంతో ఇష్టపడ్డారు. స్టేడియం, మౌలిక సదుపాయాలను చూడ్డానికే గంట సమయం పట్టింది. అత్యంత సామర్థ్యమున్న స్టేడియం మన దేశంలో ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నా. డ్రెస్సింగ్‌రూమ్‌కు జిమ్‌ను అనుసంధించడం ఇక్కడే మొదటిసారి చూశా. ఇది అద్భుతం. గుజరాత్ క్రికెట్ అసోషియేషన్‌కు, దీన్ని నిర్మాణంలో భాగస్వాములైనా అందరికీ ధన్యవాదాలు."