క్రికెట్.. దాదాపు 15వ శాతాబ్దంలోనే ఆరంభమైన ఈ ఆట... చాలా మార్పుల తర్వాత 1877లో ప్రస్తుత టెస్టు మ్యాచ్ రూపం సంతరించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన ఈ క్రీడ.. ఆ తర్వాత ఎన్నో రకాలుగా మారింది. సంప్రదాయ టెస్టు ఫార్మాట్ నుంచి వన్డేలు.. వాటి నుంచి టీ20, టీ10, పింక్‌బాల్ టెస్టు, 100 బంతుల క్రికెట్ అంటూ పలు మార్పులు జరిగాయి. తాజాగా ఐదు రోజులు జరిగే టెస్టును 4 రోజులకే కుదించాలని ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).
2023 నుంచే ప్రారంభమా...!
టెస్టు మ్యాచ్‌లు ప్రస్తుతం ఐదు రోజుల పాటు జరుగుతుండగా... 2023-2031 షెడ్యూల్ మధ్య జరగనున్న టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఈ నిడివిని నాలుగు రోజులకు తగ్గించాలని భావిస్తోంది ఐసీసీ. క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచడమే కాకుండా ద్వైపాక్షిక సిరీస్‌ల సంఖ్యను పెంచడం, లీగ్‌లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో బీసీసీఐ అధికారుల ప్రతిపాదనల ఆధారంగానే దీనిని రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ ఫార్మాట్లోని కొన్ని విశేషాలు చూద్దాం.
మార్పులేంటి...?
అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు రోజుల టెస్టులు కొత్తేం కాదు. ఇప్పటికే ఇలాంటి మ్యాచ్‌లు ప్రయోగాత్మకంగా నిర్వహించారు. 2017లో దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య ఈ తరహా మ్యాచ్ జరిగింది. 2019లో ఐర్లాండ్-ఇంగ్లాండ్ మధ్య మరో మ్యచ్ నిర్వహించారు.
>> ఐదు రోజుల ఫార్మాట్లో రోజుకు 90 ఓవర్లు వేస్తే.. నాలుగు రోజులకు మ్యాచ్ కుదించడం వల్ల రోజూ 98 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఫలితంగా ప్రతిరోజు ఆరున్నర గంటలు మ్యాచ్ జరగనుంది. ఇది ప్రస్తుతం కంటే అరగంట ఎక్కువ సమయం. ఇది ఆఖర్లో ఓవర్లు పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది.
>> తొలి రెండు సెషన్లు ఒక్కోటి 2 గంటల 15 నిముషాలు జరగనున్నాయి. గతంలో రెండు గంటలకు ఒక సెషన్ ఉండేది. సెషన్ తర్వాత 20 నిముషాలు టీ బ్రేక్ ఇవ్వనున్నారు. గతంలో తొలి సెషన్ తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చేవారు. ఇప్పుడు రెండో సెషన్ తర్వాత 40 నిముషాలు డిన్నర్ బ్రేక్ ఇవ్వనున్నారు.
>> ఒకవేళ ఓవర్లు వేయడం ఆలస్యమైతే ఆ సమయాన్ని ఎలా కుదిస్తారన్నది నూతన విధానంలో ప్రస్తావించలేదు.
>> ఇప్పటివరకు ప్రత్యర్థి ఇచ్చిన లక్ష్యంలో 200 పరుగులకు తక్కువ చేస్తే ఫాలోఆన్‌లో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు ఆ మార్కును 150 పరుగులకు తగ్గించారు.
>>మ్యాచ్.. మధ్యాహ్నం 1.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మొదలవుతుంది. 7.30 గంటలకు సూర్యస్తమయం అవుతుందని భావిస్తోంది ఐసీసీ. 7 నుంచి 7:30 మధ్య సమయాన్ని ఆఖర్లో ఓవర్లు పూర్తి చేయడానికి ఇస్తారు.
2019లో ఫలితాలు ఇలా...
గత రెండేళ్ల ఫలితాలను విశ్లేషిస్తే... 40 శాతం మ్యాచ్‌లు మాత్రమే ఐదో రోజు వరకు జరిగాయి. అంటే 60 శాతం మ్యాచ్‌లు 4 రోజుల్లోనే ముగిశాయి. 2019లో 39 టెస్టులు జరిగితే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే 400 ఓవర్లు బౌలింగ్ వేశారు బౌలర్లు. అంతేకాకుండా 13 మ్యాచ్‌లు ఐదో రోజున పూర్తవగా...4 మ్యాచ్‌లు డ్రా గా ముగిసాయి. మిగతా 22 మ్యాచ్‌లు ఫలితాలు నాలుగు రోజుల్లోనే తేలిపోయాయి.
ఐసీసీ నయా రూల్: నాలుగు రోజుల టెస్టు సాధ్యమేనా? ఐసీసీ నయా రూల్: నాలుగు రోజుల టెస్టు సాధ్యమేనా? ఉపయోగాలేంటి..
టెస్టుల నిడివి నాలుగు రోజులే నిర్వహిస్తే... 2015-23 మధ్య కాలంలో బోర్డులు, ఆటగాళ్లే కాకుండా అంతర్జాతీయ బోర్డుకూ లాభమేనని అంటోంది ఐసీసీ. 2023-2031 కాలంలో నాలుగు రోజుల టెస్టులను అమలు చేస్తే... దాదాపు 335 రోజులు ఖాళీ సమయం ఆటగాళ్లకు లభిస్తుందట. ఈ సమయాన్ని ఉపయోగించుకొని బోర్డులు టెస్టు సిరీస్‌లు, టోర్నీలను నిర్వహించుకోవచ్చు. ఇది ఆర్థికంగా మంచి ఫలితాన్నిస్తుందని ఐసీసీ భావిస్తోంది.
ఐసీసీ నయా రూల్: నాలుగు రోజుల టెస్టు సాధ్యమేనా? తేడాలుంటాయా..?
నాలుగు రోజుల్లేనే మ్యాచ్ ముగియాలంటే అందుకు తగినట్లే పిచ్‌ను క్యూరేటర్లు తయారు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారడమే కాకుండా తక్కువగా డ్రా అవుతాయి. టెస్టులు మరింత వేగంగా జరుగుతాయి.
నాలుగు రోజుల ఆట వల్ల ఆటగాళ్లకు ఎక్కువ విశ్రాంతి దొరుకుతుంది. గాయలపాలవడం తగ్గుతుంది. ఓ జట్టు ఏడాదికి 15 టెస్టులు ఆడితే, అది 75 మ్యాచ్‌ల కింద లెక్క. అదే 4 రోజుల టెస్టు అయితే 15 రోజులు మిగులుతాయి.
ఐసీసీ నయా రూల్: నాలుగు రోజుల టెస్టు సాధ్యమేనా? దిగ్గజాలు.. మిశ్రమ స్పందనలు
నాలుగు రోజుల టెస్టు ఆలోచనను ఇప్పటికే పలువురు ప్రస్తుత క్రికెటర్లు, మాజీలు వ్యతిరేకించారు. కొందరు మాత్రం మద్దతిస్తున్నారు. తాజాగా ప్రపంచ దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఈ అంశంపై స్పందించాడు. టెస్టుల నిడివిని అయిదు రోజుల నుంచి నాలుగు రోజులకు తగ్గించాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నాడు. కొత్త తరాన్ని ఆకర్షించేందుకు, ప్రతి విషయాన్ని మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
కోహ్లీ,మైకేల్ వాన్, మెక్‌గ్రాత్, గంగూలీ క్రికెట్‌లో వన్డేలు, టీ20లు, టీ10లు, 100 బాల్స్ ఫార్మాట్‌లు ఉన్నాయని... కానీ ఆటలో సుదీర్ఘ ఫార్మాట్ స్వచ్ఛమైన రూపమని అన్నాడు మాస్టర్. సంప్రదాయమైన ఈ ఫార్మాట్ నిడివిని తగ్గించకూడదని పేర్కొన్నాడు. ఇటీవల కోహ్లీ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. అంతేకాకుండా చాలా మంది దిగ్గజ క్రికెటర్లు ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు నాథన్ లయన్, టిమ్ పైన్, గ్లెన్ మెక్‌గ్రాత్, ట్రావిస్ హెడ్ సహా కివీస్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్, ఇంగ్లాండ్ మాజీ మైకేల్ వాన్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు.
ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టులపై ఇప్పుడే స్పందించడం మరీ తొందరపాటవుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పరోక్షంగా వ్యతిరేకించినట్లు మాట్లాడాడు.
మద్దతుదారులు..
టెస్టు క్రికెట్‌కు మరింత ఆదరణ పెంచేందుకు ఈ మార్పు స్వాగతించదగ్గదే అని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ కెవిన్ రాబర్ట్స్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డులు ఈ నిర్ణయంపై సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అమలు..?
2019లో అన్ని టెస్టులు 5 రోజుల కంటే ముందే ముగిశాయి. ఎక్కువ శాతం బలమైన జట్లు తమకంటే తక్కువ స్థాయి జట్లతోనే మ్యాచ్‌లు ఆడాయి. అదే రెండు జట్లు బలమైనవైతే ఫలితం ఐదు రోజుల వరకు సాగుతుంది.
ఉదాహరణకు యాషెస్ సిరీస్‌లో 4 రోజుల టెస్టు మ్యాచ్ ఉంటే... ఇంగ్లాండ్ జట్టు టెస్టు సిరీస్‌ను 1-0తేడాతో నెగ్గేది. కానీ ఐదు మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు ఐదో రోజు వరకు కొనసాగాయి. ఫలితంగా 2-2 తేడాతో సిరీస్ సమమైంది. ఇప్పటికే పలు బోర్డులు దీనిపై సుముఖంగా ఉండగా... బీసీసీఐ మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోనుంది. ఏది ఏమైనా ఎన్నో ఏళ్ల చరిత్ర మార్చేందుకు ఐసీసీ తలపెట్టిన నిర్ణయం అమలవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.