సఫారీ స్టార్ ప్లేయర్ డివిలియర్స్‌పై రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దేశం కన్నా ఆదాయార్జనే కోసమే.. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడని ఆరోపించాడు. ప్రపంచకప్‌లో ఆడేందుకు అవకాశం ఇవ్వాలని ఏబీడీ అడిగినా.. దక్షిణాఫ్రికా బోర్డు తిరస్కరించింది. డివిలియర్స్ పునరాగమన ప్రతిపాదనపై అక్తర్ స్పందించాడు.
డివిలియర్స్‌పై అక్తర్ మండిపాటు - shoab akthar
దక్షిణాఫ్రికా క్రికెటర్ డివిలియర్స్‌పై పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. ఆదాయం పట్ల ఉన్న ఆసక్తి అతడికి దేశం విషయంలో లేదని అభిప్రాయపడ్డాడు. ఆడగలిగే సత్తా ఉన్నా రిటైర్మెంట్ ప్రకటించడాన్ని పూర్తిగా తప్పుబట్టాడు.
" మరో రెండేళ్లు ఆడగల సత్తా ఉన్నా.. నువ్వు అనవసరంగా రిటైర్మెంట్ ప్రకటించావు. మళ్లీ ఇప్పుడు దేశానికి ఆడతానంటూ ముందుకు రావడం వెనుక ఏదో జిమ్మిక్కు ఉంది. ముందు రిటైర్మెంట్ ప్రకటించి ఒక తప్పు చేశావు. మళ్లీ ప్రపంచకప్‌లో ఆడతానంటూ అడగడం మరో తప్పిదం. ఒక్కసారి నీవే ఆలోచించుకో. ఆట విషయంలో నీకున్న గొప్ప పేరును చెడగొట్టకోవద్దు".
--షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్
"ఎటువంటి పరిస్థితిలో అయినా మ్యాచ్‌లను గెలిపించగల సత్తా ఉన్న డివిలియర్స్ ప్రపంచకప్‌లో లేకపోవడం దక్షిణాఫ్రికాకు లోటు. ఒకవేళ అతను జట్టుతో ఉన్నట్లయితే మిడిల్ ఆర్డర్ కచ్చితంగా బలంగా ఉండేది. జట్టు కూడా మంచి స్థానంలో ఉండేది. కానీ ప్రస్తుతం వరుస ఓటములతో చతికిలపడింది. కేవలం ఆదాయం కోసం దేశ ప్రయోజనాలు పూర్తిగా పక్కన పెట్టాడు. ఈ ప్రపంచకప్‌తో పాటు, వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ వరకు ఆడగల సత్తా ఏబీడీకి ఉంది. ఇలాంటి సమయంలో దేశానికి మొదటి ప్రాధాన్యమివ్వకుండా... ఆదాయం వచ్చే ఐపీఎల్, పీఎస్‌ఎల్ వంటి టోర్నీలవైపు మొగ్గు చూపడం నిజంగా విచారించదగ్గ విషయం" అని అక్తర్ అన్నాడు.