తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ, బుమ్రా కంటే వారిద్దరే గొప్ప!' - క్రికెట్ న్యూస్

టీమ్​ఇండియా స్టార్ క్రికెటర్లు కోహ్లీ, బుమ్రాపై పాక్ మాజీ క్రికెటర్ అఖిబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరి కంటే బాబర్ ఆజామ్, షాహిన్ అఫ్రిది మెరుగని చెప్పాడు.

After Kohli-Babar Debate, Pak's Aaqib Javed Compares Shaheen Afridi And Jasprit Bumrah
'కోహ్లీ, బుమ్రా కంటే వారిద్దరే గొప్ప!'

By

Published : Apr 13, 2021, 8:54 PM IST

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్లు కొందరు కొన్నిసార్లు విచిత్రమైన వాదనలు, పోలికలు తెరపైకి తెస్తుంటారు. టీమ్‌ఇండియా స్టార్ల కన్నా తమ క్రికెటర్లు గొప్పవాళ్లను పొగుడుతుంటారు. మరికొందరైతే సంచలన వ్యాఖ్యలతో మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ఆ దేశ మాజీ పేసర్‌‌ ఆఖిబ్‌ జావెద్‌ ఇలాగే మాట్లాడాడు. బుమ్రా కన్నా షాహిన్‌ అఫ్రిది మెరుగని, బాబర్‌ ఆజామ్‌ను చూసి కోహ్లీ నేర్చుకోవాలని సూచించాడు.

కొత్త బంతితో బుమ్రా కన్నా షాహిన్‌ అఫ్రిది మెరుగైన పేసరని ఆఖిబ్‌ అన్నాడు. ఆఖరి ఓవర్లు వేయడంలో మాత్రం బుమ్రాదే ఆధిపత్యమని అంగీకరించాడు. ఈ ఇద్దరు యువ పేసర్లు సామర్థ్యం పరంగా సమానంగా ఉంటారని పేర్కొన్నాడు. 'బుమ్రా అద్భుతమైన పేసర్‌. మ్యాచులో ఏ దశలోనైనా బౌలింగ్‌ చేస్తాడు. డెత్‌ ఓవర్ల విషయంలో షాహిన్‌పై అతడిదే ఆధిపత్యం' అని పాకిస్థాన్‌ క్రికెట్‌ యూట్యూబ్‌ ఛానల్లో ఆఖిబ్‌ చెప్పాడు.

2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బుమ్రా.. 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 83, వన్డేల్లో 108, టీ20ల్లో 59 వికెట్లు పడగొట్టాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన అఫ్రిది.. 15 టెస్టుల్లో 48, 25 వన్డేలలో 51, 23 టీ20ల్లో 25 వికెట్లు తీశాడు.

టీమ్‌ఇండియా సారథి కోహ్లీ పాకిస్థాన్‌ యువకెరటం బాబర్‌ ఆజామ్‌ను చూసి నేర్చుకోవాలని జావెద్‌‌ సూచించాడు. ప్రతి ఒక్కరికీ బలహీనతలు ఉంటాయని కోహ్లీకీ ఉన్నాయని అన్నాడు. ఆఫ్‌సైడ్‌ స్వింగయ్యే బంతులకు ఔటవుతాడని పేర్కొన్నాడు. ఆజామ్‌ మాత్రం అస్సలు ఆ ఉచ్చులో చిక్కుకోడని తెలిపాడు.

'ఆజామ్‌తో పోలిస్తే కోహ్లీ అమ్ముల పొదిలో మెరుగైన, భిన్నమైన షాట్లు ఉంటాయి. కానీ అతడికీ బలహీనతలు ఉన్నాయి. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు అతడు ఇబ్బంది పడతాడు. ఇంగ్లాండ్‌లో అండర్సన్‌ ఆఫ్‌స్టంప్‌లో దేహానికి దూరంగా‌ బంతులేసినప్పుడు ఔటయ్యాడు. సచిన్‌ తెందూల్కర్‌లా బాబర్‌కు ఎలాంటి బలహీనతలు లేవు. సచిన్‌లాగే అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉంటాడు. టెక్నిక్‌ బాగుంటుంది. సురక్షితంగా ఆడతాడు' అని ఆఖిబ్‌ అన్నాడు.

ABOUT THE AUTHOR

...view details