టీ20 క్రికెట్లో ఓ బౌలర్ మూడు వికెట్లు తీస్తేనే మంచి ప్రదర్శన చేసినట్లు.. మరీ 5 వికెట్లు తీస్తే అత్యుత్తమంగా ఆడినట్లే.. అదే ఒక్క ఓవర్లో తీస్తే అద్భుతమనే చెప్పాలి. ఈ అరుదైన ఘనతను భారత వర్థమాన బౌలర్ అభిమిన్యు మిథున్ అందుకున్నాడు. హరియాణాతో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సెమీస్లో ఒకే ఓవర్లో హ్యాట్రిక్ సహా 5 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.
కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మిథున్.. 39 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన మిథున్.. హరియాణా బ్యాట్స్మెన్ హిమాన్షూ రానా, రాహుల్ తెవాటియా, సుమిత్ కుమార్, అమిత్ మిశ్రా, జయంత్ యాదవ్ ఔట్ చేసి జట్టు విజయంలో కీలక పాత్రపోషించాడు. గత నెలలో విజయ్ హజారే ట్రోఫీలోనూ తమిళనాడుతో మ్యాచ్లో మిథున్ హ్యాట్రిక్ సాధించడం విశేషం.