పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ తన బ్యాట్‌ను వేలంలో కొన్నాడని బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ వెల్లడించాడు. కరోనాపై పోరాటంలో విరాళాలు సేకరించడానికి 2013లో శ్రీలంకపై డబుల్‌సెంచరీ చేసిన బ్యాట్‌ను వేలానికి ఉంచాడు రహీమ్. దాన్ని 20 వేల యూఎస్ డాలర్లు పెట్టి సొంతం చేసుకున్నాడు అఫ్రిదీ. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
"తన ఫౌండేషన్‌లో ఉంచడం కోసం షాహిద్ అఫ్రిదీ నా బ్యాట్‌ను కొన్నాడు. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. గతవారం బ్యాట్‌ను అమ్మడానికి పెట్టా. కానీ కొంతమంది మోసగాళ్ల వల్ల రద్దు చేశాము. ఈ విషయం తెలుసుకున్న అఫ్రిదీ తానే స్వయంగా బ్యాట్‌ను కొంటానని మే 13న ఒక లెటర్ రాశాడు. దాని కోసం 20 వేల యూఎస్ డాలర్లు ( బంగ్లాదేశ్ కరెన్సీ ప్రకారం 16.8 లక్షల రూపాయలు) వెచ్చించాడు".
-ముష్ఫికర్ రహీమ్, బంగ్లాదేశ్ వికెట్ కీపర్