అఫ్గానిస్థాన్ ఓపెనర్ నజీబుల్లా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. శుక్రవారం, రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొట్టడం వల్ల తీవ్ర గాయాలపాలయ్యాడు. అతని పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని అఫ్గాన్ క్రికెట్ బోర్డు తాత్కాలిక సీఈఓ నజీమ్ వెల్లడించారు.
ఐసీయూలో అఫ్గాన్ క్రికెటర్.. పరిస్థితి విషమం - క్రికెట్ న్యూస్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన అఫ్గానిస్థాన్ క్రికెటర్ నజీబుల్లా పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.
నజీబుల్లా
"రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నజీబుల్లా ప్రస్తుతం ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, కోలుకుంటాడో లేదో చెప్పడం కష్టమని వైద్యులు తెలిపారు" అని నజీమ్ పేర్కొన్నారు.
నజీబుల్లా 2014 మార్చిలో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు అఫ్గాన్ తరఫున 12 టీ20లు, ఒక వన్డే ఆడాడు. 24 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో పాల్గొన్న నజీబుల్లా.. ఆరు సెంచరీలు, 10 అర్ధసెంచరీలతో 2,030 పరుగులు చేశాడు.