ప్రపంచ క్రికెట్లోఅఫ్గానిస్థాన్ మరో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తోన్న ఈ జట్టు... ఇప్పుడు టెస్టుల్లోనూ అదరగొట్టింది. తనకన్నా మెరుగైన బంగ్లా జట్టును ఓడించింది. బంగ్లాలోని చట్టోగ్రామ్‌లో ముగిసిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో 224 పరుగుల తేడాతో గెలిచింది. సుదీర్ఘ మ్యాచ్‌లకు తొలిసారి కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన యువ సంచలనం రషీద్‌ఖాన్ బ్యాట్‌తోనూ బంతితోనూ రాణించాడు. ఫలితంగా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. అయితే అవార్డును రిటైర్మెంట్ ప్రకటించిన ఆ దేశ సీనియర్ ఆటగాడు నబీకి అంకితం చేశాడు.
అఫ్గాన్ ఇచ్చిన 398 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లా.. రెండో ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌కు వరుణుకు కాస్త అంతరాయం కలిగించాడు.
డ్రా అనుకుంటే...
వర్షం వల్ల చివరి రోజైన సోమవారం రెండు సెషన్లలో ఆట సాగలేదు. ఆఖరి సెషన్లో కాస్త తెరిపినిచ్చాడు వరుణుడు. అప్పటికి 18.3 ఓవర్ల ఆటే మిగిలుండగా.. బంగ్లాదేశ్ చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. షకిబ్‌తో పాటు సౌమ్య సర్కార్ క్రీజులో ఉండటం వల్ల మ్యాచ్ డ్రాగా ముగిసేలా కనిపించింది. అయితే ఆఖర్లో మూడు కీలక వికెట్లు తీసి జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు రషీద్‌ఖాన్.