ప్రస్తుతం పరిస్థితులు కాస్త కష్టంగానే ఉన్నా త్వరగానే అలవాటు పడొచ్చని ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ అన్నాడు. కరోనా ముప్పు నేపథ్యంలో ఇవన్నీ తప్పవని పేర్కొన్నాడు. తమ జట్టు ఆటగాళ్లు కొత్త పద్ధతులకు వేగంగానే అలవాటు పడుతున్నారని వెల్లడించాడు.
"ఇవన్నీ కష్టంగా లేవని అనను. కానీ కొద్ది సమయంలోనే అలవాటు పడొచ్చు. సన్నాహక పద్ధతులు మారాయి. వాటిని మనం అనుసరించక తప్పదు. ఏదేమైనప్పటికీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. బంతిపై ఉమ్మి రాయకుండా ఉండేందుకు మేం జాగ్రత్తగా ఉంటున్నాం. ఐతే పాత అలవాటు మాత్రం బౌలర్లను వేధిస్తుంటాయి. వాటిపై దృష్టిపెట్టాలి."