అసోం గుహవటి వేదికగా ఆదివారం భారత్ - శ్రీలంక మధ్య జరగాల్సిన తొలి టీ20 రద్దు కావడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే మ్యాచ్ రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించకముందే కొందరు ఆటగాళ్లు స్టేడియం నుంచి వెళ్లిపోయారని అసోం క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపాడు.
"చాలామంది ఆటగాళ్లు తొమ్మిది గంటలకే స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అయితే అంపైర్లు రాత్రి 9.54కి మ్యాచ్ రద్దయినట్లు ప్రకటించడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బహుశా మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులు గొడవ చేయకుండా ఉండేందుకు అలా ప్రకటించి ఉండొచ్చు. కానీ క్రికెటర్లు ముందుగానే వెళ్లిపోవడం మాత్రం వాస్తవం" -దేవజిత్ సైకియా, ఏసీఏ కార్యదర్శి
మరికొంత సమయం ఇచ్చి ఉన్నట్లయితే మైదానాన్ని సిద్ధం చేసేవాళ్లమని చెప్పాడు దేవజిత్.
మైదానాన్ని సిద్ధం చేస్తున్న సిబ్బంది
"దాదాపు 63 నిమిషాల పాటు భారీవర్షం కురిసింది. 8.45లోపు మైదానాన్ని సిద్ధం చేయకుంటే మ్యాచ్‌ను రద్దు చేయక తప్పదని మ్యాచ్ అధికారులు స్పష్టం చేశారు. అయితే సిబ్బందికి అంపైర్లు 57 నిమిషాల సమయమే ఇచ్చారు. మరికొంత సమయం ఇచ్చి ఉంటే మైదానాన్ని సిద్ధం చేసేవాళ్లం. రివర్స్ ఆస్మోసిస్ కారణంగా పిచ్ చిత్తడిగా మారింది. జనవరిలో సాధారణంగా గుహవటిలో వర్షాలు ఎక్కువగా ఉండవు. కానీ ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం పడింది. అయితే టాస్ సమయానికి మైదానాన్ని సిద్ధం చేశాం." -దేవజిత్ సైకియా, ఏసీఏ కార్యదర్శి
భారత్×శ్రీలంక తొలి టీ20 ఆరంభ సమయానికి 15 నిమిషాల ముందు మొదలైన వర్షం దాదాపు గంట తర్వాత ఆగిపోయింది. వరుణుడు శాంతించిన తర్వాత అంపైర్లు మళ్లీ పరిశీలించి.. మ్యాచ్ నిర్వహణ వీలుకాకపోవడం వల్ల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లో శ్రీలంకతో టీమిండియా నేడు రెండో మ్యాచ్ ఆడనుంది.
ఇదీ చదవండి: భారత్లో ఆడటం కష్టం: లబుషేన్