విరుద్ధ ప్రయోజనాల అంశంలో కెప్టెన్ కోహ్లీపై, సంజీవ్ గుప్తా చేసిన ఆరోపణలను కార్నర్‌స్టోన్ సీఈఓ బంటీ సజ్దే ఖండించారు. అవన్నీ నిరాధార వ్యాఖ్యలని వెల్లడించారు. టీమ్ఇండియా సారథి కోహ్లీ విరుద్ధ ప్రయోజనాలకు పాల్పడుతున్నాడని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్, బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్‌కు తాజాగా మెయిల్ పంపారు.
కోహ్లీ టీమ్ఇండియాకు కెప్టెన్‌గా ఉండటం సహా కార్నర్‌స్టోన్ స్పోర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడని గుప్తా అందులో పేర్కొన్నారు. లోధా ప్యానెల్ సిఫారసులను విరాట్ ఉల్లంఘిస్తున్నాడని తెలిపారు. అయితే గుప్తా చేసిన ఫిర్యాదును పరిశీలిస్తామని బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ వెల్లడించారు. గతంలో ఆటగాళ్లపై ఇలాంటి ఆరోపణలు చేసినా అవి నిరాధారంగా ఉన్నాయని అన్నారు జైన్.
"కోహ్లీ, కార్నర్స్టోన్ల చుట్టూ ఇటీవలే జరిగిన ఆసక్తి ఊహాగానాలకు సంబంధించింది ఈ అంశం. కోహ్లీ పేరును పదే పదే ఇందులోకి లాగడం దురదృష్టకరం. ఇటువంటి ఊహాగానాలు పూర్తిగా నిరాధారమైనవి. మా క్లైయింట్లలోని టాలెంట్ క్రీడాకారుల్లో కార్నర్స్టోన్కు కోహ్లీ ప్రత్యేకమైన వ్యక్తి మాత్రమే. బాధ్యత కలిగిన ఏజెన్సీగా విరాట్‌తోనే కాకుండా మరే ఇతర ప్రతిభావంతులైన క్రీడాకారులతో మాకు సంబంధాలు లేవు. కానీ, స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది వేరేలా ఆలోచించేందుకు ఇష్టపడతారు"