ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ పేసర్ లసిత్ మలింగను మళ్లీ చూడకపోవచ్చని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సందేహం వ్యక్తం చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల శ్రీలంక పేసర్ ఈ ఏడాది యూఏఈలో నిర్వహించే మెగా టోర్నీలో పాల్గొనడం లేదని తెలుస్తోంది.
"మలింగ ఈ సీజన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అది మనందరికీ తెలిసిందే. అతని తండ్రి ఆరోగ్యం బాగోలేదు. కొద్దిరోజుల్లోనే శస్త్రచికిత్స ఉంది. అందుకే అతడు ఇంటి దగ్గరే ఉండాలనుకున్నట్లు చెప్పాడు. అతడు లేకపోతే ఈ సీజన్ కాస్త వెలితిగా అనిపిస్తుంది. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. అలాంటి పేసర్ లేకపోతే ఈ సీజన్‌లో మజా (ఎంటర్‌టైన్‌మెంట్) తగ్గిపోతుంది. ఏదేమైనా అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. ఇతడిని మళ్లీ మనం ఐపీఎల్‌లో చూడకపోవచ్చు. ఎందుకంటే మధ్యలో బౌలింగ్ కోచ్‌గా మారాడు. తిరిగి జట్టులోకి వచ్చి మళ్లీ బౌలర్‌గా అవతారమెత్తాడు. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌ల్లో చివరి ఓవర్ వేసి.. ఆఖరి బంతికి ముంబయిని గెలిపించాడు"