తాను ఆడుతున్న సమయంలో ఓసారి జాతివివక్షను ఎదుర్కొన్నానని టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ ఆకాశ్ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇద్దరు దక్షిణాఫ్రికా క్రికెటర్లు తనను దూషించారని చెప్పుకొచ్చాడు.
"ఒకానొక సమయంలో మేమూ (క్రికెటర్లు) జాతివివక్షకు ఎదుర్కొన్నాం. ఇంగ్లాండ్ క్రికెట్ లీగ్ ఆడుతున్నప్పుడు ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న నన్ను 'పాకీ' అని పిలిచారు. ఆ క్షణం నాకిప్పటికీ గుర్తుంది. పాకీ అంటే పాకిస్థాన్‌కు షార్ట్‌ఫామ్ అని మీరంతా అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. ఓ జాతిని దూషించేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఆ సమయంలో జట్టు నాకు మద్దతుగా నిలిచింది"