తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: 1996 టోర్నీలో ఆసక్తికర అంశాలెన్నో.. - sanath jayasuryus

1996 ప్రపంచకప్​ టోర్నీలో శ్రీలంక విజేతగా నిలవగా.. ఆస్ట్రేలియా రన్నరప్​గా సరిపెట్టుకుంది. టీమిండియా సెమీస్​కు వెళ్లి ఓడింది.

ప్రపంచకప్

By

Published : May 18, 2019, 5:16 PM IST

శ్రీలంకలో బాంబు దాడుల నేపథ్యంలో మ్యాచ్​కు దూరంగా ఉన్న ఆసీస్, విండీస్ జట్లు...! ఒక్క మ్యాచ్ గెలవకుండానే క్వార్టర్స్​లోకి ప్రవేశించిన లంకేయులు...! సెమీస్​లో భారత ఓటమి పట్ల ఈడెన్​​లో అభిమానుల నిరసన..! ఇవన్నీ 1996 ప్రపంచకప్​లో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలు.

రెండోసారి ఉపఖండ పిచ్​లపై ప్రపంచకప్ జరిగిన సంవత్సరం 1996. భారత్, పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా టోర్నీని నిర్వహించాయి. ఈ మెగాటోర్నీని విల్స్​ వరల్డ్​కప్​గా పిలిచారు.1987లో తొలిసారిగా భారత్, పాకిస్థాన్ కలిసి ప్రపంచకప్​కు ఆతిథ్యం ఇచ్చాయి.

1996 ప్రపంచకప్

మెగాటోర్నీలో పాల్గొన్న జట్ల సంఖ్య ఈసారి 12కు చేరింది. కొత్తగా నెదర్లాండ్స్, యూఏఈ, కెన్యా అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఆరు జట్లను రెండు పూల్స్​గా విభజించారు. పూల్​ ఏలో భారత్​తో పాటు శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, కెన్యా ఉండగా.. పూల్ బీలో పాకిస్థాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, హాలాండ్. యూఏఈ ఉన్నాయి. మొదటిసారిగా క్వార్టర్ ఫైనల్​ను పరిచయం చేసింది ఈ ప్రపంచకప్​లోనే. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్​కు అర్హత సాధిస్తాయి. క్వార్టర్ ఫైనల్లో గెలిచిన జట్లు సెమీస్​కు వెళతాయి.

శ్రీలంకలో బాంబు దాడి.. క్వార్టర్స్​కు లంకేయులు
1996 జనవరిలో శ్రీలంక సెంట్రల్ బ్యాంక్​పై తమిళ టైగర్స్ వేసిన బాంబు కలకలం సృష్టించింది. ఈ కారణంగా శ్రీలంకతో మ్యాచ్​ను బహిష్కరించాయి ఆస్ట్రేలియా, విండీస్ జట్లు. ఈ రెండు మ్యాచ్​లకు శ్రీలంక జట్టుకు పూర్తి పాయింట్లు అందించింది ఐసీసీ. ఫలితంగా లంక జట్టు మ్యాచ్​లు ఆడకుండానే క్వార్టర్స్​కు అర్హత సాధించింది.

ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా జట్టు మంచి జోరు మీద కనిపించింది. గ్రూపు దశలో ఆడిన ప్రతి మ్యాచ్​లో విజయం సాధించి పూల్ బీ అగ్రస్థానంలో నిలిచింది. ప్రొటీస్​తో పాటు పాకిస్థాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పూల్ బీలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. పూల్ ఏలో శ్రీలంక, భారత్, ఆస్ట్రేలియా, విండీస్ క్వార్టర్స్​కు అర్హత సాధించాయి. క్వార్టర్స్​లో ఇంగ్లాండ్​తో శ్రీలంక, ఆసీస్​తో కివీస్, పాక్​తో ఇండియా, విండీస్​తో దక్షిణాఫ్రికా తలపడ్డాయి.

శ్రీలంక జట్టు

జయసూర్య ప్రతాపం
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ను శ్రీలంక ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్​కు వచ్చిన లంక జట్టులో సనత్ జయసూర్య అద్భుత ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. 44 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అసన్క గురుసిన్హా 45(63) కూడా మెరవగా.. లంక జట్టు విజయం సాధించింది. ప్రపంచకప్​లో ఇంగ్లాండ్ సెమీస్ చేరకుండా ఇంటిముఖం పట్టడం ఇదే మొదటిసారి.

జయసూర్య

దాయాది పోరు..
మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్​లో దాయాదులు భారత్, పాకిస్థాన్ పోటీపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్​కు మంచి ఆరంభం లభించింది. టీమిండియాలో సిద్ధు 93(115), సచిన్ 31(59), సంజయ్ మంజ్రేకర్ 20 (43), సారథి అజారుద్దీన్ 27 (22), వినోద్ కాంబ్లీ 24(26), అజయ్ జడేజా 45(25) మంచి ప్రదర్శనతో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేశారు. అయితే స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ ఓ ఓవర్ కోల్పోయింది. వారి లక్ష్యం 49 ఓవర్లకు 288 పరుగులుగా నిర్దేశించారు అంపైర్లు. పాక్ ఓపెనర్లు అమీర్ సొహైల్ 55(46), సయీద్ అన్వర్ 48(32)మంచి ఆరంభాన్ని అందించినా వరుసగా వికెట్లు కోల్పోయి చివరకు 9 వికెట్లకు 248 పరుగులు చేసి ఓటమిపాలయ్యారు. పాక్ వెటరన్ క్రికెటర్​ మియాందాద్​కు ఇదే చివరి మ్యాచ్​.
మిగిలిన రెండు క్వార్టర్​ ఫైనల్స్​లో కివీస్​పై ఆసీస్ విజయం సాధించగా.. ఈ టోర్నీలో ఫేవరేట్లుగా భావించిన దక్షిణాఫ్రికా విండీస్ చేతిలో ఓటమిపాలైంది. సెమీఫైనల్లో శ్రీలంకతో ఇండియా, విండీస్​తో ఆసీస్ తలపడ్డాయి.

భారత్ ఓటమి.. అభిమానుల నిరసన
ఈడెన్ గార్డెన్ వేదికగా సెమీస్​లో భారత్​, శ్రీలంక తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన భారత కెప్టెన్ అజారుద్దీన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక మిడిలార్డర్ బ్యాట్స్​మెన్ అద్భుత ప్రదర్శనతో 8 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం సచిన్ 65(88), సంజయ్ మంజ్రేకర్ 25(48) మంచి ఆరంభం అందించినా సచిన్ ఔటైన తర్వాత పరిస్థితి తారుమారైంది. 120 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో అనిల్ కుంబ్లే, వినోద్ కాంబ్లీ ఉన్నారు. ఇంకా 16 ఓవర్లు ఉన్నాయి. అప్పుడే కోల్​కతా మైదానంలో టీమిండియా అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మైదానంలోకి బాటిళ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. అంపైర్లు, మైదానం సిబ్బంది విన్నవించినా పరిస్థితి మారలేదు. ఫలితంగా శ్రీలంక గెలచినట్లు మ్యాచ్​ రిఫరీ క్లైవ్ లాయిడ్ ప్రకటించారు. మొదటిసారిగా శ్రీలంక ఫైనల్లోకి అడుగుపెట్టింది. మరో సెమీస్​లో ఆసీస్ విండీస్​పై 5 పరుగుల తేడాతో గెలుపొందింది.

మొదటిసారి విజేతగా లంకేయులు
లాహోర్​లో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన శ్రీలంక సారథి అర్జున రణతుంగ బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే మంచి బౌలింగ్, ఫీల్డింగ్ ప్రదర్శనతో ఆసీస్​ను 241 పరుగులకే కట్టడి చేశారు లంక బౌలర్లు. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 23 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అనంతరం అసన్క గురుసిన్హా 65(99), వైస్ కెప్టెన్ అరవింద డిసిల్వా 107 (124), కెప్టెన్ అర్జున రణతుంగ 47* (37) మెరవగా.. లంకేయులు మొదటిసారి ప్రపంచకప్ విజేతగా నిలిచారు. ఈ టోర్నీ శ్రీలంక క్రికెట్​లో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.

కొన్ని ఆసక్తికర విషయాలు
అత్యధిక పరుగులు - సచిన్ తెందూల్కర్ (523) (భారత్)
అత్యధిక వికెట్లు - అనిల్ కుంబ్లే (15) (భారత్)
జట్టు అత్యధిక పరుగులు - 398/5 శ్రీలంక.. కెన్యాపై
జట్టు తక్కువ పరుగులు - 93 వెస్టిండీస్.. కెన్యాపై

ఇవీ చూడండి.. WC19: అనుమానాస్పద మృతి- ఇప్పటికీ ఓ మిస్టరీ

ABOUT THE AUTHOR

...view details