తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రీడాలోకం: "జైట్లీ మృతి తీరని లోటు" - సీకే ఖన్నా

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల క్రీడా సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు క్రికెటర్లు. గౌతమ్ గంభీర్, సెహ్వాగ్ సహా కొంత మంది ప్రముఖులు జైట్లీ మృతికి సంతాపం తెలిపారు.

క్రీడాలోకం: "జైట్లీ లేని లోటు పూడ్చలేనిది"

By

Published : Aug 24, 2019, 9:39 PM IST

Updated : Sep 28, 2019, 3:56 AM IST

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ ​జైట్లీ.. దిల్లీలోని ఎయిమ్స్​లో నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల క్రీడాసమాజం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. స్వతహాగా క్రికెట్ ప్రేమికుడైన జైట్లీ.. దిల్లీ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగానూ పనిచేశారు.

ప్రముఖ క్రికెటర్లు గౌతమ్​ గంభీర్​, వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా తదితరులు జైట్లీకి నివాళులర్పించారు.

అరుణ్ జైట్లీ చనిపోయారంటే తనలో ఓ భాగం కోల్పోయినట్లు అనిపిస్తోందని గంభీర్ ట్వీట్ చేశాడు.

"కన్నతండ్రి మాట్లాడటం నేర్పిస్తే, తండ్రిలాంటి వ్యక్తి ఎలా మాట్లాడాలో సూచిస్తారు. కన్నతండ్రి నడవడం నేర్పిస్తే, తండ్రి లాంటి వ్యక్తి నడవడిక బోధిస్తారు. కన్నతండ్రి పేరు మాత్రమే పెడతారు. తండ్రిలాంటి వ్యక్తి మీ పేరుకు గుర్తింపునిస్తారు. ఇలా తండ్రి సమానులైన అరుణ్​జైట్లీ మృతి చెందారంటే నాలో సగభాగం నన్ను వదిలి వెళ్లినట్టు అనిపిస్తోంది." -గౌతమ్ గంభీర్​, భారత మాజీ క్రికెటర్

జైట్లీతో వ్యక్తిగతంగా తనకు ఎంతో అనుబంధం ఉందని తెలిపాడు వీరేంద్ర సెహ్వాగ్​.

"అరుణ్‌ జైట్లీ ఇక లేరని తెలిసి ఎంతో బాధపడ్డా. ఆయన ప్రజా జీవితంలోనే కాకుండా చాలామంది దిల్లీ క్రికెటర్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించేలా కీలక పాత్ర పోషించారు. డీడీసీఏలో ఆయన నాయకత్వంలో నాతో సహా ఎంతోమందికి అవకాశాలు వచ్చాయి. ఆటగాళ్ల అవసరాలు ఆయన వినేవారు. సమస్యలు పరిష్కరించేవారు. జైట్లీతో నాకు వ్యక్తిగతంగా ఎంతో మంచి అనుబంధం ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం." -వీరేంద్ర సెహ్వాగ్​

క్రికెట్​కు ఆయన చేసిన సేవ ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా.

మా అనుబంధం శ్రీరాం కామర్స్‌ కళాశాల రోజుల్నుంచి కొనసాగుతోంది. కాలేజీ యూనియన్‌ అధ్యక్షుడిగా జైట్లీ, జనరల్‌ సెక్రటరీగా నేనూ పనిచేశాం. డీడీసీఏ, బీసీసీఐలో పనిచేసేందుకు నన్ను ఆహ్వానించారు. క్రికెట్‌కు ఆయన చేసిన సేవ ఎప్పటికీ గుర్తుంటుంది. -సీకే ఖన్నా, బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు

జైట్లీ లేని లోటు ఎవరు పూడ్చలేరని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు.

అరుణ్‌ జైట్లీ కన్నుమూశారని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఆయన క్రికెట్‌ ప్రేమికులు. ఎప్పుడూ సహాయం చేసేవారు. అండర్‌-19 స్థాయిలో బాగా ఆడుతున్న పిల్లల పేర్లూ గుర్తుంచుకునేవారు. మీరు లేని లోటును ఈ ప్రపంచం పూడ్చలేదు సర్‌. - ఆకాశ్‌ చోప్రా, మాజీ క్రికెటర్‌

మాజీ అధ్యక్షుడు అరుణ్‌ జైట్లీ మరణానికి డీడీసీఏ సంతాపం ప్రకటించింది. ఆయన అనుభవం, విజ్ఞానం, అండదండల్ని కోల్పోయామని సంఘంలోని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. - దిల్లీ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ)

భారత క్రికెట్‌ను నిష్కల్మషంగా ప్రేమించిన వారిలో అరుణ్‌ జైట్లీ ఒకరు. అవసరమైన ప్రతిసారి బీసీసీఐని కాపాడేందుకు ముందుండేవారు. క్లిష్ట సమయాల్లో ఒక న్యాయవాదిగా ఆయన బోర్డును నడిపించారు. - అవిషేక్‌ దాల్మియా, బంగాల్‌ క్రికెట్‌ సంఘం సంయుక్త కార్యదర్శి

భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్​ జైట్లీ పార్థీవ దేహాన్ని దిల్లీ ఎయిమ్స్​ నుంచి ఆయన నివాసానికి తరలించారు. ఆదివారం ఉదయం భాజపా కార్యాలయానికి తీసుకెళ్తారు. అనంతరం నిగమ్‌బోధ్‌ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఇది చదవండి: జైట్లీకి నివాళి.. నల్ల బ్యాడ్జీలతో భారత ఆటగాళ్లు

Last Updated : Sep 28, 2019, 3:56 AM IST

ABOUT THE AUTHOR

...view details