టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఆకలిగొన్న పులిలా కనిపిస్తున్నాడు. జాతీయ జట్టులో పునరాగమనానికి తాను సిద్ధమేనని బ్యాటుతో ప్రకటించాడు. డీవై పాటిల్ టీ20 టోర్నీలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లో శతకం బాదేశాడు. 39 బంతుల్లో 105 పరుగులు చేశాడు.
'కుంగ్ ఫూ పాండ్య' బ్యాక్.. 37 బంతుల్లో సెంచరీ - A century off just 37 balls
గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావాలని చూస్తోన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సత్తాచాటాడు. డీవై పాటిల్ టోర్నీలో 37 బంతుల్లోనే సెంచరీ చేసి మెరిశాడు.
డీవై పాటిల్ టీ20లో రిలయన్స్ 1 తరఫున బరిలో దిగిన హార్దిక్ పాండ్య.. కాగ్ (సీఏజీ)తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కళ్లు చెదిరే సిక్సర్లు, భారీ బౌండరీలతో దుమ్మురేపాడు. అతడు ఆడుతున్నంత సేపు బంతి బౌలర్ చేతిలో.. లేదంటే గాల్లోనే కనిపించింది. ఏకంగా 10 సిక్సర్లు, 7 బౌండరీలు బాదేశాడు. మైదానం అన్ని వైపులా అతడు షాట్లు ఆడటం గమనార్హం. అతడి విధ్వంసానికి కాగ్ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. వీ జీవరాజన్ వేసిన 15వ ఓవర్లో పాండ్య 3 సిక్సర్లు, 2 ఫోర్లతో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు.
పాండ్య విజృంభణతో రిలయన్స్ 1 జట్టు 20 ఓవర్లలో 252/5 పరుగులు చేసింది. ఇక స్టార్ ఆటగాడు శిఖర్ ధావన్ మరోసారి విఫలమయ్యాడు. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. చివరి వారం జరిగిన మ్యాచ్‌లోనూ హార్దిక్ దూకుడుగానే ఆడాడు. బ్యాంక్ ఆఫ్ బరోడాపై 25 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అదే మ్యాచులో భువనేశ్వర్, శిఖర్ ధావన్ కూడా తిరిగి మైదానంలో అడుగుపెట్టారు.