కరోనా మహమ్మారి ప్రపంచ పోకడను మార్చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్కులు, శానిటైజర్ల వాడకం, భౌతికదూరం పాటించడం వంటి నియమాలు ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. జనజీవనమే ఇలాంటి కఠిన నియమాలతో సాగుతుంటే మరి క్రీడా టోర్నీల మాటేమిటి. అవును మీరు ఊహిస్తోంది నిజమే. టోర్నీలు ఎప్పుడు ప్రారంభమైనా కొన్ని నియమనిబంధనలు మాత్రం కచ్చితంగా పాటించాల్సిందే. రాబోయే రోజుల్లో క్రికెట్ సిరీస్‌ల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయో చూద్దాం.
నెల ముందుగానే జట్లు పర్యాటక దేశాలకు చేరుకోవాలి
ప్రస్తుతం విదేశాల్లో పర్యటించడానికి ఏ దేశమూ అనుమతించడం లేదు. భవిష్యత్‌లోని సడలింపుల్లో భాగంగా క్రికెట్ సిరీస్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆటగాళ్లు మాత్రం ముందుగా క్వారంటైన్లో ఉండాల్సిందే. క్రికెటర్లు ఆ దేశ పరిస్థితులకు అలవాటు పడేందుకు, కావాల్సిన ప్రాక్టీస్ కోసం కనీసం ఓ నెలరోజుల ముందుగానే పర్యాటక దేశానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీనిని బట్టే దేశాలు వారి వారి షెడ్యూల్‌ను రూపొందించుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకేరోజు ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు
ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే టోర్నీలు జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే వీలైనంత తొందరగా పర్యటనలను ముగించేందుకు ఒకేరోజు ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు జరిపేందుకు కొన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అంటే ఒక జట్టు ఒకే రోజు ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. టెస్టు, టీ20 రెండు మ్యాచ్‌లను ఒకే రోజు ఆడటం వీలవుతుంది. అందుకోసం ఈ రెండు ఫార్మాట్లకు తగిన విధంగా జట్లను విడదీయాల్సి ఉంటుంది. దీనివల్ల యువ ఆటగాళ్లు వారి ప్రతిభను నిరూపించుకునేందుకు తగినన్ని అవకాశాలను లభిస్తాయని క్రికెట్ పండితులు చెబుతున్నారు.