తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒక్క నోబాల్ కూడా వేయని క్రికెటర్లు వీరే - ఇమ్రాన్​ ఖాన్ క్రికెట్​

మైదానంలో క్రికెట్​ ఆడేటప్పుడు బౌలర్లు నోబాల్​ వేయడం సహజం. బ్యాట్స్​మన్​ను ఔట్​ చేయాలనో, పరుగులు నియంత్రించాలనో విభిన్న బంతులు వేసే క్రమంలో అడుగు తడబడుతుంది. ఫలితంగా నోబాల్​ గీతను దాటేస్తుంటారు. అయితే ఓ ఐదుగురు అంతర్జాతీయ క్రికెటర్లు మాత్రం కెరీర్​లో ఒక్కసారి నోబాల్​ వేయలేదు. ఇందులో ఒక్కరు మాత్రమే స్పిన్నర్​ ఉండగా.. మిగతా నలుగురు ఫాస్ట్​ బౌలర్లు కావడం విశేషం. ఒక్కసారి వారి గురించి తెలుసుకుందాం.

5 worldclass cricketers who never bowled noball
16 ఏళ్ల కెరీర్​లో నోబాల్​ వేయని భారతీయ ఆటగాడెవరు?

By

Published : Jul 5, 2020, 9:47 AM IST

ప్రత్యర్థి బ్యాట్స్​మన్​ను ఔట్​ చేయాలన్న ఆరాటంలోనో, పరుగులు నియంత్రించాలన్న ఆలోచనలోనో ఎక్కువగా క్రీజు దాటుతుంటారు బౌలర్లు. ఒక్కోసారి లయ కోల్పోయినప్పుడు తప్పిదాలు జరుగుతుంటాయి. దాన్నే క్రికెట్​ పరిభాషలో ఫ్రంట్​ ఫుట్​ నోబాల్​ అంటారు. దీని వల్ల జట్టుకు ఒక రన్​ పెనాల్టీ పడగా.. దాన్ని ప్రత్యర్థి జట్టు స్కోరుకు కలుపుతారు. తర్వాత కాలంలో నోబాల్​కు ఎక్స్​ట్రా డెలివరీ రూపంలో ఫ్రీ హిట్ అనేది యాడ్​ చేశారు. ఈ బంతిని బ్యాట్స్​మన్​లు ఎంత బలంగా బాదుతారంటే.. కచ్చితంగా బౌండరీకి తరలించాలనే వారు దృష్టిపెడతారు.

నోబాల్​

నోబాల్​ వల్ల కొన్నిసార్లు మ్యాచ్​ స్వరూపాలే మారిపోయాయి. ఆ డేంజర్​ బంతికి ఫీల్డింగ్​ జట్లు ఎంతో మూల్యం చెల్లించుకున్నాయి. మరి ఆ తరహా బంతిని కెరీర్​లో ఒక్కసారి వేయని ఆటగాళ్లు ఉన్నారంటే నమ్ముతారా.? ఏకంగా వందల కొద్ది మ్యాచ్​లు, ఏళ్ల కెరీర్​ వాళ్ల సొంతం. అందుకే ఆ దిగ్గజాలతో ఓ టాప్​-5 జాబితా రూపొందిస్తే.. ఓ భారత క్రికెటర్​ అగ్రస్థానంలో నిలవడం మరీ విశేషం.

5.లాన్స్​ గిబ్స్...

ఈ వెస్టిండీస్​ దిగ్గజ బౌలర్​కు భారతీయ గడ్డపై మంచి రికార్డు ఉంది. భారత పిచ్‌లపై ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు సాధించిన రెండో బౌలర్​గా రికార్డు కైవసం చేసుకున్నాడు. టెస్టుల్లో 300 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌, క్రికెట్​ హిస్టరీలో ఆ ఫీట్​ సాధించిన రెండో క్రికెటర్​. విండీస్​ తరఫున 79 టెస్టులు, 3 వన్డేలు ఆడిన లాన్స్ గిబ్స్​.. కెరీర్​లో ఒక్క నోబాల్​ వేయలేదు. కెరీర్​లో 311 వికెట్లు సాధించాడు. అలా నోబాల్​ వేయని క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇందులో చోటు పొందిన ఏకైక స్పిన్నర్​గానూ ఘనత సాధించాడు.

లాన్స్​ గిబ్బ్​

4. డెన్నిస్​ లిల్లీ..

ఆస్ట్రేలియాకు చెందిన డెన్నిస్​ లిల్లీ.. వన్డే కెరీర్​లో 63 మ్యాచ్​లు ఆడి 103 వికెట్లు తీసుకున్నాడు. బౌలింగ్​ సగటు 20.83గా ఉంది. దిగ్గజాల్లో ఒకరైన లిల్లీ.. టెస్టుల్లో 350 వికెట్ల మార్కు అందుకున్నాడు. 1971లో కెరీర్​ ప్రారంభించిన ఆయన.. 1984లో పలు ఆరోగ్య కారణాల వల్ల కెరీర్​కు అర్ధాంతరంగా ముగింపు పలికాడు. అయితే 13 ఏళ్ల క్రికెట్​ కెరీర్​లో 70 టెస్టుల్లోనే 355 వికెట్లు సాధించాడు. సగటు 23.92గా ఉంది. 23 సార్లు 5 వికెట్లు, 7సార్లు 10 వికెట్లను​ ఖాతాలో వేసుకున్నాడు. ఈ కంగారూ బౌలర్ బౌలింగ్​ వేసినప్పుడు ఒక్కసారి గీత దాటి నోబాల్​ వేయలేదు.

డెన్నిస్​ లిల్లీ

3. ఇయాన్​ బోథమ్​..

అత్యుత్తమ ఆల్​రౌండర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ఇంగ్లాండ్​ క్రికెటర్​ ఇయాన్​ బోథమ్​. క్రికెట్​ గాడ్​ సచిన్​ వంటి ప్లేయర్​ తన అత్యుత్తమ ఆల్​రౌండర్ల జాబితాలో బోథమ్​ పేరును చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. తన జట్టుకు ఇతడు బ్యాట్​తోనూ, బంతితోనూ మరపురాని ఎన్నో విజయాలను అందించాడు. మ్యాచ్​ విన్నర్​గా పేరున్న ఈయన టెస్టులు, వన్డేల్లోనూ సత్తా చాటాడు. 15 ఏళ్ల క్రికెట్​ కెరీర్​లో 102 టెస్టులు ఆడి.. 28.40 సగటుతో 383 వికెట్లు తీశాడు. 33.54 సగటుతో 5,200 పరుగులు చేశాడు.

116 వన్డేల్లో బరిలోకి దిగిన బోథమ్.. 2,113 రన్స్​ సాధించడమే కాకుండా 143 వికెట్లు తీసుకున్నాడు. సగటు 28.54గా ఉంది. సుదీర్ఘ​ కెరీర్​లో ఒక్కసారి ఆరు బంతులకు మించి బౌలింగ్​ వేయలేదంటే అర్థం చేసుకోవచ్చు ఆయన నిబద్ధత. అందుకే ఈ జాబితాలో టాప్​-3లో చోటు దక్కించుకున్నాడు.

ఇయాన్​ బోథమ్​

2.ఇమ్రాన్​ ఖాన్​...

క్రికెటర్​గా ఎనలేని పేరు తెచ్చుకుని ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన ఈ పాక్​ క్రికెటర్​.. ఆ దేశానికి 1992 ప్రపంచకప్​ అందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లో 72 పరుగులు చేసి 1/43తో బౌలింగ్​లోనూ సత్తా చాటాడు. దాయాది దేశానికి కప్పు తెచ్చిన ఏకైక కెప్టెన్​ ఇతడే. సారథిగా తన జట్టును విజయవంతంగా నడిపించగలిగాడు.​ అందుకే అతడిని ఆ దేశ క్రికెట్​లో ఓ శకంగా అభివర్ణిస్తారు. 1982లో పాక్ కెప్టెన్​గా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్​.. 1987లో భారత్​కు వచ్చి స్వదేశీ గడ్డపైనే 'మెన్​ ఇన్​ బ్లూ'ను ఓడించాడు.

ఇమ్రాన్ ఖాన్​ 88 టెస్టులు ఆడి 3,807 పరుగులు, 362 వికెట్లు సాధించాడు. 175 వన్డేల్లో 182 వికెట్లు, 3,709 పరుగులు చేశాడు. క్రికెట్​ చరిత్రలో నోబాల్​ వేయని ఆటగాడిగానూ ఘనత సాధించాడు.

ఇమ్రాన్​ఖాన్​

1.కపిల్​దేవ్​...

భారత మాజీ సారథి, దిగ్గజ ఆల్​రౌండర్​ అయిన కపిల్​దేవ్​​.. తన కెరీర్​లో ఒక్కసారి నోబాల్​ వేయలేదు. ప్రత్యర్థులకు తనదైన బౌలింగ్​, బ్యాటింగ్​తో దడపుట్టించే ఈ హరియాణా హారికేన్​.. ఇప్పటికీ ప్రపంచ అత్యుత్తమ ఆల్​రౌండర్ల జాబితాలో టాప్​లోనే ఉంటాడు. భారత క్రికెట్​ రూపురేఖలు మార్చి, దేశ గౌరవాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన ఆటగాడు కపిల్. ఆయన రిటైర్మెంట్​ ప్రకటించి ఎన్నో ఏళ్లు గడిచినా దేశ క్రికెట్​లో ఇప్పటికీ ఈయన స్థానానికి సరైన ఆటగాడు దొరకలేదంటే.. ఆయన స్థాయి అసాధారణమని చెప్పొచ్చు.

1978లో జరిగిన టెస్టు మ్యాచ్​తో అరంగేట్రం చేసిన కపిల్​.. 1983 వన్డే ప్రపంచకప్​ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. జింబాబ్వేతో కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్​లో 138 బంతుల్లో 175 పరుగులు చేసి విశ్వరూపం చూపించాడు. 17/ 5 వద్ద ఉన్న జట్టు స్కోరు 266/8 వరకు వెళ్లిందంటే కపిల్ ఆట గురించి అర్థం చేసుకోవచ్చు. కేవలం టెయిలెండర్లతోనే ప్రత్యర్థి జట్టును ఆటాడేసుకున్నాడు. అందుకే ఈ ఇన్నింగ్స్​ను వన్డేల్లో అత్యుత్తమైన ప్రదర్శనల్లో ఒకటిగా భావిస్తారు. వెస్టిండీస్​ జట్టును లార్డ్స్​లో మట్టికరిపించి తొలిసారి భారత్​కు ప్రపంచకప్​ అందించిన సారథిగా ఘనత సాధించాడు.

కపిల్​దేవ్​

131 టెస్టుల్లో 5,248 పరుగులు, 225 వన్డేల్లో 3,783 రన్స్​ చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో 434 వికెట్లు, వన్డేల్లో 253 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 5వేల పైచిలుకు పరుగులు చేయడమే కాకుండా 400 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడు కపిల్​ కావడం విశేషం. 16 ఏళ్ల కెరీర్​లో ఒక్క నోబాల్​ వేయని ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు.

ఇక్కడ ఉన్న అందరు క్రికెటర్లలో ఎక్కువ మ్యాచ్​లు ఆడి​, ఎక్కువ పరుగులు, వికెట్లు సాధించి.. ఒక్క నోబాల్​ వేయలేదు కాబట్టే ఈ జాబితాలో కపిల్​ టాప్​-1గా నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details