తెలంగాణ

telangana

ETV Bharat / sports

మ్యాచ్​ గమనాన్నే మార్చేసిన భారత క్రికెటర్లు!

ఏ క్రీడలోనైనా యువ ఆటగాళ్లు కీలకంగా మారుతారు. క్రికెట్​లోనూ మ్యాచ్​ గమనాన్నే మర్చేసిన యువ క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. ఆరంభ దశలోనే అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లుకు షాక్​ ఇచ్చిన క్రికెటర్లు ఎవరో తెలుసుకుందామా.

5 Indian youngsters surprised the opposition
మ్యాచ్​ గమనాన్నే మార్చేసిన భారత క్రికెటర్లు!

By

Published : Feb 6, 2021, 12:51 PM IST

Updated : Feb 7, 2021, 6:21 AM IST

క్రికెట్​ అంటేనే ఫుల్​ ఆఫ్​ సర్​ప్రైజెస్​. మైదానంలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఏ జట్టు గెలుస్తుందో చెప్పడం చాలా కష్టం. ఒకానొక సమయంలో ప్రపంచ ఉత్తమ జట్లు కూడా అనూహ్య రీతిలో ఓడిన సందర్భాలున్నాయి. అలా క్రికెట్​కు పుట్టినిల్లైన ఇంగ్లాండ్​ టీమ్​.. ఐర్లాండ్​ (2011లో), బంగ్లాదేశ్​ (2015లో) వంటి చిన్న జట్ల చేతిలో పరాభవాన్ని ఎదుర్కొంది. అది కూడా ప్రపంచకప్​ లీగు దశలోనే పరాజయం పొందడం గమనార్హం.

అలా మ్యాచ్​ గమనాన్నే మలుపుతిప్పే శక్తి యువ క్రికెటర్లకు మాత్రమే ఉంది. జట్టులో సీనియర్​ క్రికెటర్లు ఉన్నా.. కొత్త ఆటగాళ్లు చేరితే, అనుభవానికి అదనపు బలాన్నిచ్చినట్లవుతుంది. ఈ విధంగా యువ క్రికెటర్లను ఉపయోగించుకోవడంలో భారత క్రికెట్​ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందుందనే చెప్పాలి. క్రికెట్​కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే మనదేశంలో అండర్​-16, 18 నుంచే క్రికెటర్లపై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఎప్పటికప్పుడు జాతీయ జట్టులో యువతరానికి అవకాశాలు ఇస్తూనే ఉంది. వచ్చిన ఛాన్సును అందిపుచ్చుకునే విధంగా యువ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో తొలి మ్యాచ్​లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. ఆ విధంగా అరంగేట్ర మ్యాచ్​లతోనే క్రికెట్​ అభిమానుల్లో లక్ష్యాన్ని తమ భుజాలపై వేసుకుని జట్టును విజయతీరాలకు చేర్చిన టీమ్ఇండియా యువ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.

1) ఇషాంత్​ శర్మ

2008లో నాలుగు టెస్టుల సిరీస్​ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత్​కు చేరుకుంది. అంతకుముందు ఇరుజట్ల మధ్య జరిగిన సిరీస్​లో భారత్​ ఓడిపోగా.. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని సన్నద్ధమైంది. అదే సిరీస్​తో పేసర్​ ఇషాంత్​ శర్మ అరంగేట్రం చేశాడు. బెంగుళూరు వేదికగా తొలిటెస్టు జరిగింది. ఈ మ్యాచ్​ తొలిఇన్నింగ్స్​లో నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇషాంత్​. ఆ మ్యాచ్​ మొత్తంగా 6 వికెట్లు సాధించాడు. సైమన్​ కటిచ్​, షేన్​ వాట్సన్​, బ్రాడ్​ హాడిన్​, కెెమెరూన్​ వైట్​ వంటి స్టార్​ బ్యాట్స్​మెన్​ను పెవిలియన్​ బాట పట్టించాడు.

ఇషాంత్ శర్మ

ఈ సిరీస్​ను టీమ్​ఇండియా 2-0 తేడాతో గెలుపొందింది. అప్పుడే అరంగేట్రం చేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్​ ఈ ఘనవిజయానికి సహకరించింది. తన తొలి ప్రదర్శనతో మ్యాచ్​ గమనాన్నే మార్చేశాడు ఇషాంత్​.

2) రోహిత్​ శర్మ

ఐసీసీ టీ20 ప్రపంచకప్​-2007.. భారత క్రికెట్​ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే టోర్నీ. ఆ టోర్నీతోనే మహేంద్రసింగ్​ ధోనీ టీమ్ఇండియా కెప్టెన్​గా ఎంపికయ్యాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్​ ఆరంభ టోర్నీలోనే టీమ్​ ఇండియా ఛాంపియన్​గా నిలిచింది. అందుకే ఈ ఏడాది అంత స్పెషల్​. విశేషమేమిటంటే ఆ టీమ్​లో ఉన్నవాళ్లంతా యువక్రికెటర్లే.

రోహిత్​ శర్మ

టోర్నీ ఆరంభంలో టీమ్ఇండియా ఆచితూచి ఆడుతూ వచ్చింది. స్కాట్లాండ్​తో భారత జట్టు ఆడాల్సిన తొలి మ్యాచ్​ రద్దైంది. ఆ తర్వాత న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో ఓటమి పాలైంది. చివరికి ఎలాగోలా సూపర్​ 8కి ధోనీసేన చేరింది. నాకౌట్​ స్టేజ్​లో​ దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్​లో ఓపెనర్లు పేలవంగా ఆడి వెనుదిరిగారు. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన రోహిత్ శర్మ, ధోనీ జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించారు. హిట్​మ్యాన్ అర్థశతకంతో అలరించగా.. 45 పరుగుల చేసిన తర్వాత మహీ రనౌట్​ అయ్యాడు. ఫలితంగా 5 వికెట్లు కోల్పోయిన టీమ్​ఇండియా 153 పరుగులు చేసింది.

ఆ తర్వాత బరిలోకి దిగిన సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 116 పరుగులకే పరిమితమయ్యారు. భారత బౌలర్​ ఆర్పీ సింగ్​ (4 వికెట్లు) ప్రత్యర్థిని దెబ్బతీశాడు. అయితే ఈ మ్యాచ్​లో రోహిత్​ శర్మ చేసిన అర్ధశతకం మ్యాచ్​ గమనాన్ని మార్చేసింది.

3) మహేంద్రసింగ్​ ధోనీ

2005లో జరిగిన పెప్సీ వన్డే సిరీస్​కు భారత్​ ఆతిథ్యం ఇచ్చింది. సిరీస్​లోని మ్యాచ్​లో ధోనీ పేలవ ప్రదర్శనతో 7 బంతుల్లో 3 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో ధోనీ ప్రదర్శనపై అందరూ అసంతృప్తికి గురయ్యారు.

ధోనీ

అదే సిరీస్​లో వైజాగ్​ వేదికగా పాకిస్థాన్​తో జరిగిన వన్డేలో సెహ్వాగ్​తో కలిసి ధోనీ విజయవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 148 పరుగులు చేసి భారత జట్టు విజయానికి బాటలు వేశాడు.

4) వాషింగ్టన్​ సుందర్​

ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీ 2020-21 క్రికెట్​​ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ సిరీస్​ ప్రారంభానికి ముందు స్టార్​ ఆటగాళ్లందరూ గాయాలపాలైనా.. రెండో టెస్టు నుంచి కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అందుబాటులో లేకపోయినా, రహానె సారథ్యంలోని యువ క్రికెటర్లు చారిత్రక విజయాన్ని నమోదు చేశారు.

నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో మూడు మ్యాచ్​ల తర్వాత 1-1తో ఇరుజట్లు సమంగా నిలిచాయి. నాలుగో టెస్టు(గబ్బా వేదికగా)కు సిద్ధమయ్యాయి. సిరీస్​ నిర్ణయాత్మక మ్యాచ్​ కావడం వల్ల ఇరుజట్లు తమతమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. గబ్బా స్టేడియంలో 32 ఏళ్లుగా ఆసీస్​ జట్టుకు ఓటమే లేదు. అయితే ఈ రికార్డును భారత యువ ఆటగాళ్లు చెరిపేశారు.

వాషింగ్టన్​ సుందర్​

అదే మ్యాచ్​లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన వాషింగ్టన్​ సుందర్​పై ఎవ్వరికీ ఎలాంటి అంచనాలు లేవు. కానీ, బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ ప్రత్యర్థిపై అనూహ్యంగా విరుచుకుపడ్డాడు. తొలి ఇన్నింగ్స్​లో సుందర్​, శార్దూల్​ భాగస్వామ్యం తర్వాత మ్యాచ్​ గమనమే పూర్తిగా మారిపోయింది. ఈ మ్యాచ్​లో యువ ఆటగాళ్లైన మహ్మద్​ సిరాజ్​ (6 వికెట్లు), శార్దూల్​ ఠాకూర్​, నటరాజన్​, రిషబ్​ పంత్ ఆసీస్​పై చారిత్రక విజయానికి కారణమయ్యారు. ​

వాషింగ్టన్​ సుందర్​.. అరంగేట్ర టెస్టు​ తొలి ఇన్నింగ్స్​లో 62 పరుగులతో పాటు 3 వికెట్లు పడగొట్టి.. రెండో ఇన్నింగ్స్​లో ఒక్క వికెట్​తో పాటు 22 పరుగులు​ నమోదు చేశాడు.

5) మహ్మద్​ కైఫ్​

లార్డ్స్​ వేదికగా 2002లో జరిగిన నాట్​వెస్ట్​ సిరీస్​ అంటే భారత క్రికెట్​ అభిమాని ఇప్పటికీ జ్ఞాపకమే. ఈ సిరీస్​లో భారత్​తో పాటు ఇంగ్లాండ్​, శ్రీలంక జట్లు కూడా ట్రోఫీ కోసం పోరాడాయి. బలమైన ప్రత్యర్థులతో ఆడుతూ ఫైనల్​కు చేరుకుంది టీమ్​ఇండియా. అయితే ఫైనల్​కు చేరిన ప్రతి సిరీస్​లోనూ భారత్​ జట్టు ఓడిపోతుందనే అపవాదు అప్పట్లే ఉండేది. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ గంగూలీసేస ఘనవిజయాన్ని నమోదు చేసింది.

నాట్​వెస్ట్​ ఫైనల్​ గెలుపొందిన విజయానందంలో టీమ్​ఇండియా

ఇంగ్లాండ్​తో జరిగిన తుదిపోరులో తొలుత బ్యాటింగ్​ చేసిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన భారత జట్టు ఓపెనర్, కెప్టెన్​ సౌరవ్​ గంగూలీ(60) అర్ధ శతకంతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించినా.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్​మెన్​ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.

146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు కష్టాల్లో పడింది. అప్పుడు 6వ స్థానంలో బ్యాటింగ్​కు దిగిన యువరాజ్​ సింగ్​ (69) ఆకట్టుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేని మహ్మద్​ కైఫ్​ ఏకంగా 87 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ గెలిచిన అనంతరం కెప్టెన్​ సౌరవ్​ గంగూలీ తన షర్ట్​ విప్పి గాల్లో తిప్పుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి:కుల్దీప్​కు మరోసారి అన్యాయం.. అభిమానుల ఆగ్రహం!

Last Updated : Feb 7, 2021, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details